ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువులోనూ కుప్పంకు చేరిన కృష్ణా జలాలు : ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

1 గంట క్రితం

Krishna waters reached Kuppam even during the drought: MLA Amarnath Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం

హంద్రీనీవా జల హారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి


ప్రజాశక్తి వీకోట (చిత్తూరు) : ఎల్ నినో ప్రభావమున్నప్పటికీ ఇంతటి విపత్కర కరువులోను కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి కొనియాడారు. పలమనేరు నియోజకవర్గం మీదుగా కుప్పం ప్రాంతానికి హంద్రీ-నీవా జలాలు వెళ్తున్న సందర్భంగా వీ. కోట మండలంలోని కృష్ణాపురం పంప్ హౌస్ వద్ద ఆదివారం గంగమ్మ తల్లికి జలహారతి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గత 10 నెలలుగా ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వర్షాలు లేక పంటలు ఎండిపోయి, పశువులకు గడ్డి కూడా దొరకని దయనీయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీశైలంలో ఉన్న కృష్ణా జలాలను ఇంతటి తీవ్ర కరువు సమయంలో కుప్పం ప్రాంతానికి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబద్ధతకు, కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. 2018-19 కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వీ.కోట దాకా నీళ్లు తీసుకువచ్చామని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో మంచి వర్షాలు కురిసినప్పటికీ, కాలువ ద్వారా ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి పారించలేకపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు రామకుప్పంలో ట్యాంకర్లతో నీళ్లు పోసి, రేకులు అడ్డం పెట్టి ప్రజలను మోసం చేస్తూ జలహారతి డ్రామాలు ఆడారని ఆరోపించారు. రాయలసీమ కరువు ప్రాంతాలకు తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తేవాలనే బీజం వేసింది నందమూరి తారక రామారావు అని, దాన్ని ఆచరణలో చూపించింది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కోట్లాది రూపాయలు వెచ్చించి, కాలువల లైనింగ్ పూర్తి చేసి ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా నీటిని తీసుకువచ్చామన్నారు. 2018-19లో తాను మంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు ఉన్న కాలంలోనూ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ, 3 నెలల పాటు పోలీసులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ నీళ్లు తేవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. గాలేరు-నగరి & హంద్రీ-నీవా అనుసంధానం : గండికోట రిజర్వాయర్ నుంచి దాదాపు రూ.2,880 కోట్ల వ్యయంతో పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల దాహార్తి తీర్చే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గంగవరం మండలం కీలపట్లలో స్టోరేజ్ ఏర్పాటు చేసి, సుమారు రూ.1,800 కోట్లతో ప్రతి ఇంటికీ కుళాయి (ట్యాప్) కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే ప్రాజెక్ట్ టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే ఏజెన్సీ ఖరారై ఏడాదిన్నరలో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక ఈ ప్రాంత రైతులకు హార్టికల్చర్ రంగం కింద సుమారు రూ.లక్ష కోట్లతో రోడ్డు కనెక్టివిటీ, మార్కెట్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో అన్ని గ్రామాలకు తారు/సిమెంట్ రోడ్ల పనులకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు నాయకత్వంలో రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చాక అతి తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని, కూటమి ప్రభుత్వ పనితీరును ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కమిటీ డైరెక్టర్ రంగనాథ్, పలమనేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రాంబాబు, ఈశ్వర్ గౌడ్, సోమశేఖర్, విశ్వనాధ్, శభరీష్, హరినాథ్ రెడ్డి, రూహుళ్ల, నాసీర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్