మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు నమోదుపై ప్రశ్నలు!

1 గంట క్రితం

chitur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 02:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కడపనత్తంలో 13 మంది చిన్నారులు.. పాతపేటలో 9 మంది హాజరు

హాజరు పట్టికలు, పౌష్టికాహార పంపిణీపై విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్‌

ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని కడపనత్తం, పాతపేట అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు నమోదు తీరుపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చిన్నారుల హాజరు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారా, రికార్డుల్లో నమోదవుతున్న హాజరుకు, కేంద్రాల్లో వాస్తవంగా ఉన్న చిన్నారుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా అనే అంశాలపై అధికారులు పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు. కడపనత్తం అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 21 మంది చిన్నారులకు గాను 13 మంది హాజరైనట్లు సమాచారం. మధ్యాహ్నం 12.12 గంటల సమయంలోనూ హాజరు పట్టికలో వివరాలు నమోదు కాకపోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలో టీచర్‌ సరోజమ్మ, సహాయకురాలు సావిత్రమ్మ విధులు నిర్వహిస్తున్నారు. చిన్నారుల హాజరును సకాలంలో నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ జాప్యం ఎందుకు జరుగుతోందో అధికారులు విచారించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా పాతపేట అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 27 మంది చిన్నారులకు గాను 16 మంది హాజరైనట్లు సమాచారం. అయితే పాఠశాలలో హాజరు  మాత్రం తొమ్మిది మంది మాత్రమే ఉన్నట్లు నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కేంద్రంలో టీచర్‌ ముని వెంకటమ్మ, సహాయకురాలు మహేశ్వరి విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా హాజరైన చిన్నారుల సంఖ్యకు, రికార్డుల్లో నమోదైన వివరాలకు మధ్య వ్యత్యాసం ఉండటానికి కారణాలేమిటో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


పౌష్టికాహార పంపిణీపైనా పరిశీలన అవసరం

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహార పదార్థాల పంపిణీ సక్రమంగా జరుగుతోందా అనే అంశంపైనా స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హాజరు రిజిస్టర్లు, రోజువారీ రికార్డులు, పౌష్టికాహార పంపిణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీడీఎస్‌ అధికారులు రెండు కేంద్రాలను తనిఖీ చేసి, హాజరు నమోదులో జాప్యానికి గల కారణాలను తెలుసుకోవడంతోపాటు రికార్డుల్లో నమోదైన వివరాలను వాస్తవ హాజరుతో సరిపోల్చాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది. క్ష‍ేత్రస్థాయిలో పరిశీలించి అంగనవాడి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని సిడిపిఓ అరుణ శ్రేణి అన్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, విధి నిర్వహణలో క్రమశిక్షణ లేకపోయినా ఉన్నతాధికాలకు నివేదిక పంపి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


chitur-1


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్