అన్ని 21 పంచాయతీలు అర్హత సాధిస్తే భారీగా నిధులు – ఎంపీడీఓ ఆనందబాబు
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే ప్రభుత్వం నుంచి రూ.3.25 కోట్ల ప్రోత్సాహక నిధులు అందే అవకాశం ఉందని సహాయ జిల్లా ఎన్నికల ప్రాధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో శుక్రవారం బైరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో స్టేజ్–I రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జి.ఓ.ఆర్టి.నం.1111, తేదీ 13-11-2026 ప్రకారం సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగి, అధికారికంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు అందజేస్తుందని వివరించారు. జనాభా దామాషా ప్రకారం మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటికి రూ.15 లక్షలు, బైరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున మొత్తం 21 పంచాయతీలు అర్హత సాధిస్తే రూ.3.25 కోట్ల నిధులు సమకూరనున్నాయని తెలిపారు. అర్హత నిర్ధారణ అనంతరం నిధులను విడతలవారీగా విడుదల చేస్తారని పేర్కొన్నారు.ఈ నిధులను తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర ఆమోదిత అభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. సాధారణంగా పంచాయతీలకు లభించే గ్రాంట్లకు అదనంగా ఈ ప్రోత్సాహక నిధులు అందడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛందంగా ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థుల ప్రచార ఖర్చులతో పాటు పోలింగ్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు తావివ్వకుండా గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులపై ప్రజలు, గ్రామ పెద్దలు చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.అయితే ఏకగ్రీవ ఎన్నిక అనేది పూర్తిగా స్వచ్ఛందంగా జరగాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నామినేషన్ దాఖలు చేసి పోటీ చేసే హక్కు, ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉందన్నారు. ప్రోత్సాహక నిధుల పేరుతో ఎవరినీ నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం, ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం తగదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులందరికీ సమాన సమాచారం, సేవలు అందించాలని అధికారులకుసూచించారు.ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా సమన్వయం సాధిస్తే బైరెడ్డిపల్లి మండలానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులను సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేజ్–I ఎన్నికల అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)