- ఝార్ఖండ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కొత్త టాటా సిగ్నా వాహనం డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టివేత
ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి : మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్ పట్టుబడ్డాడు. ఆదివారం స్థానిక బాట గంగమ్మ గుడి సమీపంలో ఏఎస్ఐ పి. మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ నుంచి బెంగళూరుకు కొత్త టాటా సిగ్నా వాహనాన్ని తీసుకెళ్తున్న డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను తనిఖీ చేశారు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా 89.9 శాతం రీడింగ్ వచ్చినట్లు సమాచారం. దీంతో స్థానిక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిబంధనల ప్రకారం రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. వాహనానికి సంబంధించిన చర్యలతో పాటు సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రాణాంతకం
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ప్రమాదాల నివారణకు పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని స్థానిక ఎస్సై చందన ప్రియ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.








కామెంట్లు (0)