ఇళ్లలోకి చొచ్చుకెళ్లి దౌర్జన్యం చేశారంటూ గ్రామస్తుల ఆరోపణ
జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి
ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి(చిత్తూరు): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి మూలతిమ్మేపల్లిలో నిర్వహించిన డీజే ఊరేగింపు వివాదానికి దారితీసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నట్లు గ్రామస్తులు ఆరోపించారు.
గ్రామంలో డీజే నిర్వహించవద్దని ముందుగానే పోలీసులకు తెలిపినప్పటికీ, అభ్యంతరాలను పట్టించుకోకుండా భారీ శబ్దాలతో ఊరేగింపు నిర్వహించారని బాధితులు వాపోయారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. డీజే ఊరేగింపు సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్తులపై కొందరు దౌర్జన్యానికి దిగారని, గేట్లు, గోడలు తోసుకుంటూ ఇళ్లలోకి ప్రవేశించి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)