రహదారిపై ధాన్యం ఆరబెడుతుండగా ఢీకొన్న కారు.. పెంగరగుంటలో విషాదం
ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : రూరల్ మండలం పెంగరగుంట గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ధాన్యం ఆరబెట్టుకుంటూ కూర్చున్న ముగ్గురు మహిళలను గుడియాత్తం నుంచి పలమనేరు వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురూ మృత్యువాతపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పలమనేరు–గుడియాత్తం ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెంగరగుంట గ్రామానికి చెందిన సాలమ్మ (70) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు మహిళలు జ్యోతి (50), మునెమ్మ (50) లను మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. మృతులను సాలమ్మ, జ్యోతి, మునెమ్మగా పోలీసులు గుర్తించారు. ముగ్గురూ పెంగరగుంట గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పలమనేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది.
పెంగరగుంట ప్రమాదంపై సిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్త దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. పెంగరగుంట గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంపై ఐద్వా కార్యదర్శి జయంతి, కమిటీ సభ్యులు రాజా, శ్రీరాములయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కారు ఢీకొని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.







కామెంట్లు (0)