స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ బి.సునీల్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకర వాతావరణ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల సహకారం, మద్ధతు ఎంతో అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ బి.సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరపాలక కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. 17 వ వార్డు ఐఓసీ వద్దనున్న జీటీఎస్(గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్)ను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరంలోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల(జీవీపీ)ను RRR (రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్) సెంటర్ సాయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని అభినందించారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 గైడ్‌లైన్స్‌ను తప్పక పాటించాలని, ఘన వ్యర్థాల నిర్వహణను పక్కాగా నిర్వహించాలని సూచించారు. లెగసీ వ్యర్థాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. బయో రెమిడియేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి.. ఏజన్సీకి పలు సూచనలు చేశారు. తదననంతరం నగర పారిశుధ్యాన్ని పర్యవేక్షించారు. 11 వ వార్డు వీఎల్ పురంలో డోర్ టూ డోర్ చెత్త సేకరణను పరిశీలించి.. వెహికల్ మూవ్ మెంట్, యాక్షన్ ప్లాన్ ను అడిగి తెలుసుకున్నారు. ఘన వ్యర్థాలను మూలం వద్దే తడి–పొడి వ్యర్ధాలుగా వేరు చేసి సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ ప్లాంట్లలో శుద్ధి చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర అంటే పరిసరాలు పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకమని.. ప్రజలు పూర్తిగా సహకరిస్తేనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పర్యటనలో ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)