సమాజాన్ని మేల్కొల్పడంలో ఉపాధ్యాయులదే కీలక బాధ్యత
కేంద్ర విధానాలతో పౌర స్వేచ్ఛకు విఘాతం
పతనం దిశగా భారత ఆర్థిక వ్యవస్థ : ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్
ప్రజా పోరాటాలకు అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవన్ వేదిక కావాలి : ఎమ్మెల్సీ గోపి మూర్తి
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : సమాజాన్ని మేలుకొలపడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, దేశం వృద్ధ జనాభా దశలోకి వెళ్లకముందే ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యాలయం "అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవన్" ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.కార్యక్రమానికి యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఇవీవీ ఎస్సార్ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. షరీఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పౌర స్వేచ్ఛలు దెబ్బతింటున్నాయని, ప్రశ్నించే వారిని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అంటూ ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరసనలకు తగిన వేదికలు ఉండాలని, ప్రతి నిరసన స్థలం జంతర్ మంతర్‌లా మారినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు.భారతదేశం వచ్చే పదేళ్లపాటు సుమారు పది శాతం ఆర్థిక వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న యువ జనాభా దేశానికి అపూర్వ అవకాశమని, 2040 నాటికి వృద్ధ జనాభా దశలోకి వెళ్లేలోపు ఉపాధి అవకాశాలు సృష్టించకపోతే దేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో చిన్న పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత యూనిట్లను అభివృద్ధి చేస్తే భారీ స్థాయిలో ఉపాధి కల్పించవచ్చని సూచించారు.విద్య, ఆరోగ్యం, మహిళల సంక్షేమం, నాణ్యమైన ప్రభుత్వ విద్య, సమాన అవకాశాలు, పరిశుభ్రమైన జీవన వాతావరణమే అభివృద్ధి చెందిన సమాజానికి ప్రమాణాలని పేర్కొన్నారు. విద్య అనేది కేవలం కంఠస్థం కాకుండా విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేలా ఉండాలని, సమాజ మార్పుకు ఉపాధ్యాయులు, యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.శాసనమండలి సభ్యుడు గోపి మూర్తి మాట్లాడుతూ యూటీఎఫ్ సభ్యులందరికీ ఉద్యమాభినందనలు తెలిపారు. నూతనంగా నిర్మించిన అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవనం ఉపాధ్యాయ ఉద్యమాలకే కాకుండా అన్ని ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అనుసరిస్తోందని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలతో ప్రభుత్వ విద్య బలహీనపడుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు ఉద్యమ సైనికులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఉపాధ్యాయుల కృషే కారణమని కొనియాడారు. సీపీఎస్ రద్దు కోసం సాగించిన ఉద్యమం ఫలించిన సందర్భంగా ఆగస్టు 16న విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఐఆర్, పీఆర్సీ అంశాల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి విశేషంగా కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి సెప్టెంబర్ 5న విజయవాడలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసి సత్కరించనున్నట్లు ప్రసాద్ పేర్కొన్నారు.మాజీ ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ 1983 నుంచి యూటీఎఫ్‌తో తనకు అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రాథమిక విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు. అక్షరాస్యత, సారా వ్యతిరేక, అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో సంఘం విశేష సేవలందించిందని ప్రశంసించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారని అభినందిస్తూ, నూతన భవనం ప్రజా ఉద్యమాలకు కేంద్రబిందువుగా మారాలని ఆకాంక్షించారు.మాజీ ఎమ్మెల్సీ ఐ.వి. మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు మందగించిన సమయంలో విద్యార్థి ఉద్యమాలే కొత్త ఊపు తీసుకొచ్చాయని అన్నారు. అణచివేతలు ఎదురైనా విద్యార్థులు పోరాట పతాకాన్ని వదల్లేదని, వామపక్ష, విప్లవ విద్యార్థి సంఘాలు ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచాయని చెప్పారు. యువత, విద్యార్థులు ప్రజా సమస్యలపై మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం ప్రభుత్వ విద్య, ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేసే విధానాలను యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం యూటీఎఫ్ నిరంతర పోరాటం చేస్తోందన్నారు.ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సంఘీభావం, స్నేహబంధాల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, సమాజ మార్పు కోసం ఐక్యతే ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక నాయకులు స్వర్గీయ కామ్రేడ్ అప్పారి వెంకటస్వామి కుమారుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అప్పారి సత్య ప్రకాష్, ఎస్ టి ఎఫ్ ఐ
జాతీయ మాజీ కార్యదర్శి నిన్న అరుణ కుమారి రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాజమండ్రి కి చేరువలో బొమ్మూరులో ఏర్పాటుచేసిన యుటిఎఫ్ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి కేఎస్ ఎస్ ప్రసాద్ తో పాటు వివిధ బ్లాకులను ఆహుతులు ప్రారంభించారు. అంతకుముందు యుటిఎఫ్ పతాకాన్నిఆవిష్కరించి ఉద్యమ గీతాలు ఆలపించారు. అక్కడ నుంచి ఎర్రజెండాలతో ర్యాలీగా సభ వేదిక కి తరలి వెళ్లారు. ఉపాధ్యాయ ఉద్యమ స్ఫూర్తిదాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ పి జయకర్, ఇవిఎస్ఆర్ ప్రసాద్, షరీఫ్ రూపస్ రావు, రమణ శ్రీనివాసమూర్తి, విజయ గౌరీ, శ్రీమణి, చిలుకూరి శ్రీనివాసరావు, కే రమేష్, ప్రకాష్, నరేష్, పలు జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)