ప్రజాశక్తి-అనపర్తి (తూర్పు గోదావరి) : స్థానిక శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ ఆవరణలో సోమవారం “అమరావతి ఛాంపియన్‌షిప్స్-2026” నియోజకవర్గ స్థాయి అండర్-17 మరియు అండర్-23 స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, చదువుతో పాటు ఆటలను కూడా ప్రధాన అంశంగా చేర్చి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు. చదువు ఒక్కటే కాకుండా ఆటల పట్ల ఆసక్తి పెంచుకున్నప్పుడే విద్యార్థులలో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఆ దిశగా ప్రతి విద్యార్థిని, యువకుడిని ప్రోత్సహించాలని కోరారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండు కేటగిరీలలో దాదాపు 12 రకాల ఆటలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలిచిన క్రీడాకారులు జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. రాబోయే ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం నాడు తుది విజేతలకు ఘనంగా బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితంలో క్రీడలు భాగం కావాలి : ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)