హత్యాయత్నం సెక్షన్ కింద కేసు మార్పు
నిందితులకు14 రోజుల రిమాండ్....
జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : నగరంలో మెడికోలను వాహనంతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సూరవరపు దస్వంత్ (24), దేశబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ (23)లను రాజమహేంద్రవరం 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఘటనపై తొలుత Cr.No.134/2026, BNS సెక్షన్ 125(b) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ IPS తెలిపారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కేసును BNS సెక్షన్ 110 కిందకు మార్చినట్లు వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం ఇది హత్యాయత్నం చర్యగా నిర్ధారించినట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే ....
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు.‘‘ఈనెల 3న ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో మద్యం తాగి నిందితులు మాల్‌లోకి వచ్చారు. మద్యం సేవించడంతో వారిని మాల్‌లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి నిందితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది యత్నించారు. పారిపోయే క్రమంలో నిందితులు వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను నిందితులు కారుతో మూడు సార్లు బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు హిట్ అండ్ రన్ చేసి దొరక్కుండా పారిపోయారు. ప్రమాదంపై ఈనెల 3న రాత్రి 10గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ప్రమాదంపై సమాచారం వచ్చింది. ఆ రోజు రాత్రే వైద్యవిద్యార్థి ఉమేష్ స్టేట్ మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంక వెళ్లే స్కూటీని మూడు సార్లు ఢీకొట్టి, తీవ్రంగా గాయపరచి నిందితులు పారిపోయారని సీసీ టీవీ ఫుటేజిలో తేలింది. ఘటన క్రూరంగా ఉండటంతో ఆ మేరకు సెక్షన్ లలో మార్పులు చేసి కేసు తీవ్రత పెంచాం. నిందితులు ఇద్దరినీ ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. నిందితులు మద్యం సేవించి డ్రైవ్ చేసినట్లు ఆధారాలు సేకరించాం. కల్పబుల్ మర్డర్ అటెంప్ట్ సెక్షన్ 110 కింద నిందితులపై కేసు నమోదు చేశాం. అవసరమైతే పరిస్థితులను బట్టి మరింత కఠిన సెక్షన్లు జత చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. నిందితులను కస్టడీకి ఇవ్వాలని రేపు పిటిషన్ వేస్తాం. ఈ కేసులో పోలీసులపై ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవు. సీఎం ఆదేశాల మేరకు నిస్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం సిటీలో రాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు సహా నివారణకు చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు.
రాజకీయ ఒత్తిళ్లు లేవు .....
ఈ కేసు దర్యాప్తులో పోలీసు శాఖపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఎస్పీ స్పష్టం చేశారు. కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నేరానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కేసులో తదుపరి దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా చార్జిషీటు దాఖలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా పోలీసు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
నిందితుల వివరాలు ....
1. సూరవరపు దస్వంత్ (24)
తండ్రి: గంగారావు
నివాసం: మోరంపూడి, రాజమహేంద్రవరం.
2. దేశబత్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ (23)
తండ్రి: జోసెఫ్ బాబు
నివాసం: లాలాచెరువు, రాజమహేంద్రవరం.
నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.







కామెంట్‌లు (0)