సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ మార్గంలో అపరిశుభ్రత

16 గంటల క్రితం

TEMPLE.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • యాత్రికులకు తప్పని తిప్పలు..

  • శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి

ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పుగోదావరి) : కోరుకొండ మండలంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిత్యం పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు, ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 5 గంటలకు స్వామివారి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. అయితే గిరిప్రదక్షిణ మార్గంలో అపరిశుభ్రత భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మార్గంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు మలవిసర్జన కారణంగా తీవ్ర దుర్వాసన వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ గిరిప్రదక్షిణ చేసే భక్తులు ముక్కు మూసుకుని నడవాల్సిన దుస్థితి నెలకొంది. భక్తుల సౌకర్యార్థం కొండ చుట్టూ ఏర్పాటు చేసిన నడక మార్గంలో ప్రస్తుతం తుప్పలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పాములు, విషపూరిత కీటకాలు సంచరించే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నప్పటికీ, భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా దేవస్థాన అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించి గిరిప్రదక్షిణ మార్గాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు. అలాగే మలవిసర్జనకు శాశ్వత పరిష్కారం చూపి, గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్