ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

6 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​​మూడు జిల్లాల్లో పల్లెపోరుకు రంగం సిద్ధం

నవంబరు 29న పోలింగ్‌.. అదే రోజు ఓట్ల లెక్కింపు

'తూర్పు`లో 141, కాకినాడలో 146 పంచాయతీలకు ఎన్నికలు

కోనసీమలో తొమ్మిది మండలాల్లో ఎన్నికల నిర్వహణ


ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి:

​గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో మరో ఘట్టానికి తెరలేచింది. రెండో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని గ్రామాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు ఆశావహులు సమాయత్తమవుతున్నారు. నవంబరు 29న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


​మూడు జిల్లాల్లో ఎన్నికలు

​తూర్పుగోదావరి జిల్లాలో రెండో విడతలో తొమ్మిది మండలాల పరిధిలోని 141 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1,728 పోలింగ్ కేంద్రాలు, 55 నామినేషన్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12,02,548 మంది ఓటర్లు ఉండగా, మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ​కాకినాడ జిల్లాలో కాకినాడ డివిజన్ పరిధిలోని మూడు, పెద్దాపురం డివిజన్ పరిధిలోని ఐదు మండలాలు కలిపి మొత్తం ఎనిమిది మండలాల్లో 146 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 379 గ్రామ పంచాయతీలు, 4,226 వార్డులు, 12.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ​ కోనసీమ జిల్లాలో కొత్తపేట, రామచంద్రపురం డివిజన్ల పరిధిలోని తొమ్మిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో నవంబరు 29న పోలింగ్ నిర్వహించనున్నారు.


​నామినేషన్లకు ఏర్పాట్లు

​నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు.


​277 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు

​తూర్పుగోదావరి జిల్లాలో 189 సున్నిత, 88 అత్యంత సున్నిత ప్రాంతాలు కలిపి మొత్తం 277 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో మైక్రో అబ్జర్వర్లను నియమించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించడం, ఘర్షణలకు పాల్పడటం వంటి ఘటనలను అరికట్టేందుకు మొబైల్ పోలీసు బృందాలు, రూట్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


​సిబ్బంది, రవాణా ఏర్పాట్లు

​తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 20 శాతం రిజర్వుతో కలిపి 14,459 మంది పోలింగ్ సిబ్బంది అవసరమని అంచనా వేశారు. వీరికి విడతలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి, సిబ్బంది రవాణాకు 586 వాహనాలను సమకూరుస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


​నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు

​ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించడంతోపాటు ప్రతి దశను నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛందంగా జరగాలని, ఒత్తిళ్లు, బెదిరింపులకు తావుండకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.రెండో విడత నోటిఫికేషన్‌తో మూడు జిల్లాల్లోనూ పల్లె రాజకీయాలు వేడెక్కనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్ వరకు గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్