ప్రజాశక్తి - యానాం
వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, డేటా విశ్లేషణ నైపుణ్యాలను పెంపొందించేందుకు స్థానిక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మంగళవారం ‘క్లైమేట్ డేటా అనాలిసిస్ అండ్ కమ్యూనికేషన్’ అంశంపై ఒకరోజు ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ శాఖకు చెందిన క్లైమేట్ చేంజ్ సెల్, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాతావరణ శాస్త్రం, ఐఎండీ ద్వారా డేటా సేకరణ, కార్బన్ ఫుట్‌ప్రింట్, క్లైమేట్ డేటా విశ్లేషణపై పీసీసీసీ నిపుణులు ఆర్.తేన్మొళి, టి.బాలాజీ, ఎస్. శాంతలక్ష్మి, ఎస్. పన్నీర్‌సెల్వం నాలుగు సాంకేతిక సెషన్లలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం 2026–27 క్లైమేట్ స్కాలర్ అవార్డు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నాలుగు ప్రాంతాల నుంచి ఉత్తమ పరిశోధనలు చేసిన మూడు బృందాలను ఎంపిక చేసి, ఒక్కో బృందానికి రూ.10 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ సిద్దిరెడ్డి శ్రీనివాస్, కో-కన్వీనర్ డాక్టర్ ఎం. శాంతరాజు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ డి. శాంతికుమార్, డాక్టర్ కె. శ్రీలత పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)