మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

APSRTC Hired Bus - చిన్న బ్రేక్ - బస్సు ముందున్న అద్దం ఊడిపడింది..!

15 గంటల క్రితం

APSRTC Hired Bus - A minor mishap - the bus's front windshield fell off..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 03:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆర్టీసీ అద్దె బస్సు బ్రేక్ వేయగానే ముందు అద్దం ఊడిపడింది ..!

ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ గాలికి.. బ్రేక్ వేయగానే ఊడిపడిన ముందు అద్దం !

ఏలూరు సత్రంపాడు సెంటర్లో ఘటన.. భయాందోళనకు గురైన వాహనదారులు

బయటపడిన హైయర్ బస్సుల ఫిట్‌నెస్ డొల్లతనం


ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏపీఎస్ ఆర్టీసీ అద్దె (హైయర్) బస్సుల నిర్వహణ లోపం సోమవారం మరోసారి బట్టబయలైంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటం, బస్సు యజమానుల నిర్లక్ష్యంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారింది. ఏలూరులోని సత్రంపాడు సెంటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ఏపీఎస్ ఆర్టీసీ హైయర్ బస్సు సత్రంపాడు సెంటర్ వద్దకు రాగానే, డ్రైవర్ అక్కడున్న స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేశాడు. ఆ చిన్న కుదుపునకు బస్సుకు ముందు వైపు ఉన్న ఫ్రంట్ విండ్ షీల్డ్ (అద్దం) ఒక్కసారిగా ఊడి కింద పడిపోయింది. రద్దీగా ఉండే సెంటర్లో అకస్మాత్తుగా భారీ శబ్దంతో అద్దం కిందపడిపోవడంతో అటు బస్సులోని ప్రయాణికులు, ఇటు స్థానికంగా ఉన్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అద్దం పగిలిన శకలాలు తగిలి ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


అగమ్యగోచరంగా మెయింటెనెన్స్ ...

అసలు ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్, మెయింటెనెన్స్ ఎలా ఉందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేక్ వేస్తే ఏకంగా బస్సు ముందు అద్దం ఊడి కింద పడిపోవడం చూసి జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హైయర్ బస్సుల యజమానులు లాభాలపై చూపుతున్న శ్రద్ధ వాహనాల నిర్వహణపై పెట్టడం లేదని స్పష్టమవుతోంది. రోడ్డెక్కే అర్హత లేని, కాలం చెల్లిన బస్సులను సైతం రంగులు మార్చి నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు సైతం ఫిట్ నెస్ తనిఖీలను నామమాత్రంగానే చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ అధికారులు స్పందించి అద్దె బస్సుల కండిషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్వహణను గాలికి వదిలేసిన బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్