జంగారెడ్డిగూడెంలో మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు వారి బృందంతో బుధవారం తనిఖీలు చేపట్టారు. వేగవరం హైస్కూల్ సమీపంలోని ఓ పామాయిల్ తోటలో వందలాది ట్రామడాల్ ఇంజక్షన్లు, ఉపయోగించే సూదులు కనిపించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. స్థానికులు కొందరు ఈ విషయాన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, తోటలో లభించిన ఇంజక్షన్లు, సూదులకు సంబంధించిన ఫొటోలను అధికారులకు అందించినట్లు తెలిసింది. దీంతో ఈ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు సరఫరా చేశారు ? ఎవరికి విక్రయించారు ? అనే కోణాల్లో అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంలోని రెండు మెడికల్ ఏజెన్సీల నుంచి సదరు ఇంజక్షన్లు సరఫరా అయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే అవి ఎవరికి విక్రయించబడ్డాయి, ఎలాంటి రికార్డుల ఆధారంగా సరఫరా చేశారు, చివరకు హైస్కూల్ సమీపంలోని తోటలోకి ఎలా చేరాయి అనే విషయాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ట్రామడాల్ వంటి ఇంజక్షన్ల దుర్వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హైస్కూల్ సమీపంలో ఇలాంటి ఇంజక్షన్లు, సూదులు లభించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఇంజక్షన్లు నిబంధనలకు విరుద్ధంగా బయటకు విక్రయించారా ? వాటిని ఎవరు వినియోగిస్తున్నారు ? అనే అంశాలు కూడా విచారణలో తేలాల్సి ఉంది. మెడికల్ ఏజెన్సీలలో స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు తదితరాలను పరిశీలిస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.








కామెంట్‌లు (0)