శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బుట్టాయగూడెంలో ప్రశాంతంగా మన్యం బంద్

1 గంట క్రితం

buttayi gudem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 10:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బుట్టాయగూడెం(ఏలూరు): బుట్టాయగూడెం మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచే మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. గిరిజన యువత, ఆదివాసీలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల హామీల్లో భాగంగా జీఓ నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జీఓ నంబర్‌ 3ను పునరుద్ధరించడంతో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులందరికీ జీఓ నంబర్‌ 3, 1/70 చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని తీపి కబురు చెబుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. గిరిజనులకు అన్యాయం చేసే విధంగా సుప్రీంకోర్టులో సుమారు 1,700 కేసులు దాఖలు చేసి 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గిరిజన సంఘ నాయకులు ఆరోపించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్