నాయకత్వ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సుస్థిర అభివృద్దితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న నాయకత్వ సదస్సులో రెండవ రోజైన మంగళవారం ఆయన సుస్థిర అభివృద్ధి అనే అంశంపై మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని చంద్రబాబు తెలిపారు. 15 నుంచి 20 కీలక రంగాల్లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని పెంచేలా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తిలో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు ప్రాంతాలు ముందంజలో ఉన్నాయన్నారు. అభివృద్ధి ఫలితాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి సానుకూల అభిప్రాయం పెంచాలని అన్నారు. రాష్ట్రానికి గూగుల్ వంటి సంస్థలు రావడం ఇతర రాష్ట్రాల్లో అసూయకు కారణమైందని, రాష్ట్రంలో కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తూ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.
ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు వెయ్యి టిఎంసిల నీరు సముద్రంలోకి వెళ్లిందని తెలిపారు. అందులో కనీసం 300 టిఎంసిలను వినియోగించుకోగలిగితే రాష్ట్ర పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని వెల్లడించారు. మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వంశధార, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలను నింపుకునే అవకాశం ఉంటుందని వివరించారు. వెలిగొండలో ఈ సీజన్‌లో 10.7 టిఎంసిల నీటిని నిల్వ చేస్తున్నామని, వచ్చే ఏడాది 50 టిఎంసిల వరకు నిల్వ చేస్తామని తెలిపారు. పోలవరం రెండో దశ పూర్తయితే 190 టిఎంసిల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చని, బొల్లాపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మరో 350 టిఎంసిల నిల్వ సామర్థ్యం సాధ్యమవుతుందని చెప్పారు. కడప జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా దాదాపు 100 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తయితే 1,250 నుంచి 1,400 టిఎంసిల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుందని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి దిశనే మార్చగలమని చంద్రబాబు పేర్కొన్నారు.
భూగర్భ జలాల పెంపుపైనా దృష్టి
బయటి ప్రాంతాల నుంచి నదుల ద్వారా నీటిని తీసుకురావడం ఎంత ముఖ్యమో, స్థానికంగా కురిసే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు నాయుడు చెప్పారు. భూగర్భ జలాలు పెరిగితే వ్యవసాయానికి విద్యుత్‌పై ప్రభుత్వం భరించే సబ్సిడీ వ్యయం తగ్గుతుందని, విద్యుత్ ప్రసార ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. గత 30 ఏళ్లలో దేశంలో ఊహించని స్థాయిలో మార్పులు వచ్చాయన్నారు. సాస్కి, ప్రభుత్వ నిధులు, నాబార్డ్ తదితర వనరుల నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఇప్పటికే రూపకల్పన సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన అభివృద్ధి నమూనాలను రూపొందించుకోవాలని సూచించారు. ఆలోచనా విధానం మారితే ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. కుప్పం సమీపంలో జాతీయ రహదారికి దగ్గరగా పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేశామని, దాని ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. ‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకునేలా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి లక్ష్యాలను నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్లి, ప్రతి ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి, నీటి వనరులు, మౌలిక వసతులు పెంచడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనిత, సంధ్యారాణి తదితరులు నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)