గతంలో ఎస్సీ కింద సబ్సిడీ పొందిన బిల్లు
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : యూనిట్లు 67 కాలితే .. కరెంటు బిల్లు 6,750 రూపాయలు రావడంతో విద్యుత్ వినియోగదారులు బెంబేలెత్తిపోయారు.. లోపమేంటో చూడాలని అధికారుల వద్దకు పోతే ... ఎంతొచ్చిందో అంత కట్టాల్సిందే అని తెగేసి చెప్పారు. దీంతో ఆ కుటుంబం లబోదిబోమంది.. ఈ వైనం మంగళగిరిలో జరిగింది. శనివారం విషయం వెలుగుచూసింది. మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న కే మరియమ్మకు కరెంట్ బిల్లు గత నెలలో కాల్చినందుకుగాను, ఈ నెలలో 6,750 రూపాయలు వచ్చింది. గతంలో 200 యూనిట్లు ఎస్సి కేటగిరీలో సబ్సిడీ పొందడం జరిగింది. సర్వీస్ నెంబర్ 9311100004795 గత 30 సంవత్సరాలుగా ఇదే నెంబర్ పై వాడుతున్నారు. ఈ సంవత్సరం మే నెలలో 1050 రూపాయలు బిల్లు వచ్చినట్లుగా మరియమ్మ తెలిపారు. ఇంట్లో ఫ్రిజ్, ఫ్యాన్, టీవీ, ఏసీ ఉందని తెలిపారు. బిల్లులో 168 రూపాయలు మినిమం ఛార్జి కింద, కస్టమర్ చార్జీ 30 రూపాయలు, ఇతర చార్జీల పేరుతో 6,750 రూపాయలు ఉంది. సబ్సిడీ కింద ఉన్న కరెంట్ కనెక్షన్ కు ఒకసారి గా 6750 బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారులను కలిస్తే వచ్చిన బిల్లు చెల్లించాల్సిందేనని చెప్పినట్లుగా వారు తెలిపారు. కాలిన యూనిట్లు మాత్రం 67 మాత్రమే ఉంది. మరి ఎక్కడ ఏ లోపం జరిగిందో సరి చేయవలసిన విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.







కామెంట్‌లు (0)