అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని తరిమిన మహిళలు
అర్ధరాత్రి హడావుడి
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : అర్థరాత్రి వేళ రైల్వే స్టేషన్ లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శనివారం వెలుగుచూసింది. అందిన సమాచారం మేరకు .... రైల్వే స్టేషన్ లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టుకునేందుకు తరమడంతో కాలువలో దూకాడు. అగ్నిమాపక సిబ్బంది అతనిని గంటకు పైగా శ్రమించి కాలువలో నుండి పైకి తీశారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మహిళలతో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలు, వారి కుటుంబసభ్యులు అతనిని పట్టుకునేందుకు వెంటపడటంతో స్టేషన్ నుండి పరుగెత్తి, బస్టాండ్ సమీపంలో సాయిబాబా గుడి వద్ద నిజాంపట్నం (మధ్య కాలువ) కాల్వలోకి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతనిని పట్టుకునేందుకు కాలువ వెంట వెంబడించారు. కాల్వలోకి దూకిన వ్యక్తి ఈదుకుంటూ మార్కెట్ వంతెన సమీపంలోకి వచ్చాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో విషయం బయటకు పొక్కి యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిచ్చెనలతో కాల్వలోకి దిగి ఆ వ్యక్తిని బయటకు తీశారు. పోలీసులు అతనిని వైద్యశాలకు తరలించారు. అతనిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.







కామెంట్‌లు (0)