ఆకుల ప్రాసెసింగ్‌కు కొత్త అవకాశాలు... ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..
ఆకుల పంటల ప్రాసెసింగ్‌కు కొత్త ఊతం.. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆకుల ఆధారిత పంటల ప్రాసెసింగ్ కు కొత్త అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామంలో శనివారం కరివేపాకు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. సెర్ప్, డీఆర్‌డీఏ ఆధ్వర్యం లోని నరసరావుపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం లోనే ఆకుల ఆధారిత పంటల ప్రాసెసింగ్ కు కొత్త అవకాశాలను కల్పించేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరివేపాకు, మునగాకు తదితర ఆకులను డ్రయ్యర్ ద్వారా డీహైడ్రేషన్ చేసి పొడిగా మార్చి, అవసరమైన మసాలాలు జోడించి వివిధ ఉత్పత్తులుగా మార్కెట్‌లో విక్రయించవచ్చన్నట్లు తెలిపారు. రైతులు, ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సమష్టిగా పనిచేస్తే ఈ యూనిట్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఉత్పత్తులకు మార్కెటింగ్ అత్యంత కీలకమని, రైతులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ప్లాంట్ నిరంతరం కార్యకలాపాలు కొనసాగించేలా రైతులు, మహిళా సంఘాలు, అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ను దీర్ఘకాలం విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. భవిష్యత్తులో కారం పొడి, కందిపప్పు తదితర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు అవసరమైన చిన్న యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద యూనియన్ బ్యాంక్ నరసరావుపేట శాఖ ద్వారా ప్రాజెక్టుకు రుణం మంజూరైందని మొత్తం రూ 2.33 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తుండగా ఇందులో 35 శాతం రాయితీ లభించనుందన్నారు. రోజుకు 10 టన్నుల వరకు పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు.ఈ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున కరివేపాకు సాగు చేస్తున్నారని ఏడాదిలో మూడు విడతల్లో పంట కోతకు వస్తుండగా, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఎకరాల వారీగా పంటను కొనుగోలు చేసి, కోత కోసి తరలిస్తున్నారని ప్రాసెసింగ్ ప్లాంట్ అందుబాటు లోకి వస్తే రైతులు తమ ఉత్పత్తులను నేరుగా యూనిట్ కు విక్రయించే అవకాశం ఉంటుందని డీఆర్‌డీఏ పిడి ఝాన్సీ రాణి తెలిపారు. దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ప్రాసెసింగ్ యూనిట్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)