శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాల ధర పెంపును నిరసిస్తూ ... సిపిఎం ఆందోళన, ధర్నా

59 నిమిషాల క్రితం

CPM protest and dharna against the hike in milk prices.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 03:18 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

వినాయక చవితి కానుకగా విజయ పాల ధరలను పెంచిన కూటమి సర్కార్

లీటర్ కు రెండు రూ.. పెంపు, సంవత్సరానికి 100 కోట్ల భారం

ప్రైవేటు డైరీల ధరల పెంపుకు మార్గం చూపిన కూటమి సర్కార్

అన్ని నిత్యవసరాల ధరలు పెంచి ఎడాపెడా వాయిస్తున్న పాలకులు

పాల ధరలు తగ్గించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు


విజయవాడ : కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ పాల ధరలను వినాయక చవితి రోజు నుండి ( సెప్టెంబర్ 14 తేదీ) లీటరు కు రెండు రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పాల ధర పెంపును నిరసిస్తూ ... శనివారం విజయవాడలో, విజయ డైరీ (మిల్క్ ఫ్యాక్టరీ) వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ధర్నా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బ్యానర్లు, ప్లకార్డులు చేతపట్టి ఆందోళన నిర్వహించారు. పాల వాహనాలను నిలుపుదల చేశారు. పాల ధర పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, సిటీ నేత బోయి సత్యబాబు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా బాబురావు, సత్యబాబు మాట్లాడుతూ .... నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న పేద, మధ్య తరగతి ప్రజలను పాల ధర పెంచి కూటమి ప్రభుత్వం మరో దెబ్బ తీయడం దుర్మార్గమన్నారు. విజయ డైరీ పాల ధర పెంచి ఐదు నెలలు తిరగకుండా మరోసారి ధర పెంచడం శోచనీయమన్నారు. లీటర్ కి రెండు రూపాయల చొప్పున పెంచడం వలన తక్షణం రూ.36 కోట్ల భారం, సంవత్సరానికి మూడుసార్లు పెంచడం వలన 100 కోట్ల రూపాయలు పైగా భారం పడిందని వివరించారు. బియ్యం, నూనెలు, పంచదార, ఉల్లిపాయలు వగైరా అన్ని ధరలు పెరిగి ప్రజలు కష్టాల్లో ఉండగా, ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరచటం అమానుషం అని ధ్వజమెత్తారు. చౌక డిపోల ద్వారా తక్కువ ధరలకు నిత్యవసరాలు అందిస్తామని పాలకులు ఒకవైపును ప్రకటిస్తూ, మరో వైపు ప్రభుత్వమే ధరలను పెంచడం సరికాదు అని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ డెయిరీ పాల ధరలు పెంచి, తద్వారా ప్రైవేటు డైరీలు కూడా ధరలు పెంచుకోవడానికి దారి చూపుతోందన్నారు. హెరిటేజ్ తదితర ప్రైవేట్ డెయిరీల లాభాల కోసం ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ ను దెబ్బతీసి, హెరిటేజ్ ప్రైవేటు డెయిరీలకు ప్రయోజనం కలిగించడానికి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని విమర్శించారు. తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం కూటమి మంత్రులను రంగంలో దించి... ఆగమేఘాల మీద బోర్డులో మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు వినాయక చవితి కానుకగా పాల ధర పెంచి వినియోగదారులను దెబ్బతీస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆనందంగా వినాయక చవితి పండుగ జరుపు కోవలసిన సమయంలో... పాల ధర పెంచి ప్రజలను దొంగ దెబ్బ తీయటం గర్హనీయమన్నారు. పెట్రోలు, డీజీలు ధరలు పెంచింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.... దానిని సాకుగా చూపించి పాల ధరలు అదే కూటమి పెంచడం మోసపూరితమని మండిపడ్డారు. గత నెల నుండి పాల ధర పెంచాలని నిర్ణయించినప్పుడు.... సిపిఎం ఆందోళన, ప్రజా నిరసనతో ఆనాడు పెంపు రద్దు చేశారని తెలిపారు. మళ్లీ నెల తిరగక ముందే ప్రజల కళ్ళుగప్పి పాల ధరను పెంచటం తగదు అని చెప్పారు. పాల ధర పెంపుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రజాప్రతినిదులే బాధ్యత వహించాలన్నారు. నగరంలోనూ, జిల్లాలోనూ ఉన్న కూటమి ప్రజాప్రతినిధులు పాల ధర పెంపును ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాల ధరను తగ్గించకపోతే రాబోయే నగర పాలక సంస్థ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ధరల పెంపుదలే ఎజెండాగా మారుతుందని, కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పాల ధర తగ్గించే వరకు సిపిఎం ఆందోళన కొనసాగిస్తుంది, కూటమి ప్రజా ప్రతినిధులను నిలదీస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వ పెద్దలు స్పందించి పెంచిన పాల ధర పెంపును రద్దు చేయాలన్నారు. లేకపోతే వినాయక చవితి పండగ సందర్భంలోనూ ఆందోళన తప్పదు, ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో సిపిఎం నేతలు ఈవి నారాయణ, సూరిబాబు, కొండారెడ్డి వెంకట్రావు,మస్తాన్,రాజు సూర్యనారాయణ,రవి,కృష్ణ,అమరేంద్రరావు తదితర నేతలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్