ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాజధానిలో పురపాలక, హోం, ఎం ఎస్ ఎం ఈ, సెర్ప్ శాఖల మంత్రులు పి నారాయణ, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పర్యటించారు. మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రులు పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులను తోటి మంత్రులకు మంత్రి నారాయణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ .... ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం అమరావతిలో కనిపిస్తుందన్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణ పనులు చాలా బాగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అమరావతిని చూస్తే ఆ విషయం అర్ధం అవుతుందన్నారు. బుద్ది లేకుండా కొంతమంది మావిగన్ అని గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసిపి నాయకులు అమరావతి వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. రాజధానితో రైతులు, ఉద్యోగులు, కార్మికులు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని ... గొడ్డలి పార్టీ నాయకులు మాత్రం అమరావతిలో లోపాలు వెతికే పనిలో ఉన్నారని ఆక్షేపణ వెలిబుచ్చారు. అమరావతి నిర్మాణం కోసం రాత్రింబగళ్లు కష్టపడి పనిచేస్తున్న నారాయణకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ప్రజలంతా అమరావతిలో జరిగే అభివృద్ధిని చూడాలని కోరారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ .... ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నారని, అమరావతి నిర్మాణాలు చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. దూరదృష్టితో ఆలోచించి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడం చాలా మంచి ఆలోచనన్నారు. చంద్రబాబు ముందు చూపుతో అమరావతి నిర్మాణ జరుగుతుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. త్వరలోనే ఇతర భవనాలు కూడా పూర్తవుతాయన్నారు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి : మంత్రి అనిత
05 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 05, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)