ప్రజాశక్తి–చేబ్రోలు: భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని చేబ్రోలు దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ చేసింది. స్లాట్ విధానం, రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి నిరసనగా దస్తావేజు లేఖరులు సోమవారం పెన్‌డౌన్ నిరసన చేపట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు నిరవధిక పెన్‌డౌన్ సమ్మె నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. మండలంలోని 25 మంది డాక్యుమెంట్ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ఈ నిరసనలో పాల్గొని జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు 12 రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగిస్తే తమ ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, సహాయకుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సంఘాలు ఐక్యంగా సమ్మెను నిర్వహిస్తున్నాయని తెలిపారు. సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని చెప్పారు. అయితే, కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకే ఈ ఆందోళన చేపట్టామని, ప్రజలు తమ పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు ఎ.వి.హెచ్.ఆర్. విద్యాసాగర్, అన్నదాత సుబ్బారావు, కూచిపూడి జాన్ సుందర్ సింగ్, కూచిరాజు వెంకటేశ్వర్లు, గుండవరపు నరసింహారావు, చావా శ్రీనివాసరావు, పాలడుగు రామకృష్ణ, కుందేటి దుర్గాప్రసాద్, పుల్లారావు, కృష్ణ, పురుషోత్తపట్నం వెంకటేశ్వర్లు, సాంబశివరావు, శివన్నారాయణతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, దస్తావేజు లేఖరుల సహాయకులు పాల్గొన్నారు.
జీవో నెం. 396 రద్దు చేయాలి: దస్తావేజు లేఖరుల డిమాండ్
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)