మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జీతాల కోసం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మె

1 గంట క్రితం

Gram Panchayat sanitation workers' indefinite strike for salaries.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కారంపూడి (గుంటూరు) : మండల కేంద్రమైన కారంపూడి గ్రామ పంచాయితీ లోని పారిశుద్ధ్య కార్మికులకు సుమారు 17 నెలలుగా చేసిన పనికి జీతాలు రాకపోవటంతో అనేక మార్లు మండల, జిల్లా స్థాయి పంచాయితీ అధికారులకు ఫిర్యాదులు చేసినను వారికి రావలసిన జీతాలు వారికి అందలేదని మంగళవారం స్థానిక బస్ స్థాండ్ సెంటర్ నందు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె బాట పట్టారు. జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరంలో పాల్గొన్న పల్నాడు జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి తెలకపల్లి. శ్రీనివాసరావు మాట్లాడుతూ కారంపూడి గ్రామ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన వారే పారిశుద్ధ్య పనులు చూస్తూ ఉన్నారని,వీరు చేసిన పనికి కూడా సుమారు 17 నెలలుగా రావలసిన జీతాలు పెండింగ్ లో ఉండటంతో అనేకమార్లు మండల,జిల్లా పంచాయితీ అధికారులకు ఫిర్యాదు చేశారని, అయినను ఏ విధమైన ఉపయోగం లేకపోవడంతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మండల అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చి స్వాతంత్ర దినోత్సవం నాడున స్థానిక బస్టాండ్ సెంటర్లో నిరవధిక సమ్మెకు దిగారని ఆయన తెలిపారు . నాడు సమ్మె బాట పట్టిన కార్మికులకు మండల అధికారులు,మరియు మండల నాయకులు మీకు జీతాలు అందేలా చేస్తామని ముందుగా మూడు నెలల జీతం అందిస్తామని అటు తర్వాత దశలవారీగా పెండింగ్ లో ఉన్న పూర్తి జీతాలు మొత్తం అందిస్తామని మాటిచ్చారని మండల అధికారులు మాట ఇచ్చి సుమారు వారం పైన గడిచిన వారికి ఏ ఒక్క రూపాయి కూడా అందకపోవటంతో మంగళవారం నాడు మరలా సమ్మె బాట పట్టారని ఆయన తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అంతే కాకుండా సబ్బులు,చెప్పులు,నూనెలు, యూనిఫామ్ లు అందించాలని వారు డిమాండ్ చేశారు. వీటితోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఆయన కోరారు. నిరవధిక సమ్మె దీక్ష శిబిరంలో పాల్గొన్న పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ సుమారు 17 నెలలుగా అనేక మార్లు జీతాల కోసం మండల, జిల్లా స్థాయి పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగామని అయినను మా మొర ఆలకించిన నాథుడే లేడని వారు విలపించారు. ఇన్ని నెలలుగా మేము చేసిన పనికి జీతాలు రాకపోతే మేము ఏం తిని గ్రామాన్ని శుభ్రం చేయాలని వారు ప్రశ్నించారు. అసలే చాలీ చాలని జీతంతో పనిచేస్తున్న మాకు ఆ జీతం కూడా అందకపోతే మేము,మా పిల్లలు ఏం తిని బ్రతకాలని వారు విలపిస్తున్నారు. మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు మొత్తం ఇచ్చేవరకు నిరవధిక సమ్మె విరమించే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తెలియజేశారు. గ్రామంలో సుమారు ఐదు రోజులుగా పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో ఎక్కడ చెత్త అక్కడ పేరుకపోయి గ్రామం మొత్తం దుర్వాసన వెదజల్లుతుందని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు రావలసిన పెండింగ్ జీతాలు మొత్తం అందించే లాగా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్