బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమార్కులకు కల్పవృక్షంగా కుప్పగంజి వాగు...

22 జులై, 2026

Kuppaganji Stream—a veritable 'Kalpavriksha' (wish-fulfilling tree) for the unscrupulous...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 04:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వాగుకు ఒక వైపు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు... మరో వైపు వాగు పోరంబోకు భూమి ఆక్రమించి వెంచర్లు...

  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం...


ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపం లోని కుప్పగంజి వాగు అక్రమ మట్టి తవ్వకాలు, వాగు పోరంబోకు భూముల ఆక్రమణలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వాగుకు ఒకవైపు నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు కొనసాగుతుండగా, మరోవైపు వాగు పోరంబోకు భూములను ఆక్రమించి వెంచర్ల అభివృద్ధి చేపడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు సమర్థవంతమైన చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాగులో భారీ గుంతలు తవ్వి ప్రతిరోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో టిప్పర్ లోడుకు రూ 6 వేల నుంచి రూ 7 వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వాగులో నియంత్రణ లేకుండా తవ్వకాల కారణంగా భారీ గుంతలు ఏర్పడి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఆనుకుని ఉన్న కుప్పగంజి వాగు భారీ వర్షాల సమయంలో పొంగిపొర్లితే ములకలూరు గ్రామంతో పాటు సమీపం లోని ప్రభుత్వ మైనార్టీ కళాశాల, వసతి గృహాలు, నివాస ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వాగు కట్టలు కోతలకు గురైతే ఆయా భవనాలు కుంగి పగుళ్ళు వచ్చే అవకాశాలు లేకపోలేదు.సమీపంలో వాగులో కోతలు పాఠశాలలకు సమీపంలో ఏర్పడిన లోతైన గుంతల్లో ప్రమాదాలు జరిగే అవకాశముందని, గతంలో రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందిన ఘటనలను గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీ తీర్మానం, సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే సర్వే 490,491,492,493 లలో 30 ఎకరాలలో నిర్మిస్తున్న వెంచర్ లో వాగు పోరంబోకు భూములను వెంచర్‌లో కలుపుకుని ప్రహరీలు నిర్మించినట్లు సమాచారం. ఈ వెంచర్‌లో సెంటు స్థలాన్ని రూ.4 లక్షల నుంచి రూ 5 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో వాగు పొంగితే వెంచర్‌ లోకి వరద నీరు చేరే ప్రమాదం ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. నరసరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరగడంతో అక్రమ మట్టి తవ్వకాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కుప్పగంజి వాగులో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, పోరంబోకు భూముల ఆక్రమణలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్