శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏళ్లతరబడి జీతాలు పెంచరా..? - రాజధానిలో హౌస్ కీపింగ్ కార్మికుల నిరసన

1 గంట క్రితం

No salary hikes for years? – Housekeeping workers protest in the capital.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -తుళ్లూరు (గుంటూరు) : ప్రభుత్వాలు ఏళ్ల తరబడి జీతాలు పెంచకుండా తాత్సారం చేయడం తగదంటూ .... అసెంబ్లీ, సచివాలయంలో పనిచేయుచున్న హౌస్ కీపింగ్ కార్మికులు నిరసనకు దిగారు. రాష్ట్ర సచివాలయంకు కూతవేటు దూరంలో మల్కాపురం సెంటర్లో శనివారం హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జీతాలు పెంపు కోసం దశల వారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సిఐటియు జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్థిలాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు యం రవి,బి లక్ష్మణరావు మాట్లాడుతూ .... 2019లో హౌస్ కీపింగ్ కార్మికులకు జీతాలు పెంచారని, ఆ తరువాత ఇప్పటివరకు పెంపు ఊసే లేదన్నారు. ప్రతియేటా నిత్యావసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నప్పటికీ ఆ మేరకు కార్మికుల జీతాలు మాత్రం పెరగలేదన్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు, ఇతర అన్ని రకాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, అరకొర జీతాలతో కార్మికుల కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నాయని రవి, లక్ష్మణరావు అన్నారు. ఇదే ప్రాంతంలోని మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులకు రూ 21వేలు ఇస్తున్నారని, అదే పని చేస్తున్న అసెంబ్లీ, సచివాలయ హౌస్ కీపింగ్ కార్మికులకు మాత్రం రూ10,470లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. జీతాలు పెంపు పై ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కె సురేష్ కుమార్, సి ఆర్ డి ఎ కమిషనర్ వి.విజయరామరాజు అదనపు కమిషనర్ పి కార్తీక్ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ను కలిసి సమస్య తెలియజేశామని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జీతాలు పెంపు జరగకపోతే కార్మికులకు దశలవారీగా ఆందోళన బాటపట్టడం తప్ప మరో మార్గం లేదని, కార్మికులు చేపట్టే ఆందోళనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో బడా కార్పొరేట్ కంపెనీలకు ఎకరం భూమిని కేవలం 99 పైసలకే ఇస్తున్న ప్రభుత్వాలకు కార్మికులకు వేతనాలు పెంచదానికి మనసొప్పడం లేదని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కార్మికులకు కనీస వేతనాల చెల్లింపు ఎందుకు అమలు జరపడం లేదని నిలదీశారు. శాసనాలు చేసే రాజధానిలోనే కార్మిక చట్టాలు అమలుచేయకపోతే ఎట్లా.. అని రవి, లక్ష్మణరావు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు జీతాల పెంపుకు చర్యలకు ఉపక్రమించాలని, లేనిపక్షంలో కార్మికులు అనివార్యంగా ఆందోళన బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె గ్రేస్, బుజ్జి, సుజాత, బుల్లెమ్మాయి, ఇందిరా, పుష్ప, కోటేశ్వరి, అమ్ములు, భవ్య, సురేష్, నిర్మల, భారతి, సాధన, స్వప్న, రాజకుమారి, శివమ్మ, లక్ష్మీ, ఏసుబాబు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్