న్యూఢిల్లీ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) చైర్మన్ మనన్ మిశ్రా మెడకు రాజీనామా ఉచ్చు బిగుస్తోంది. నల్సార్ వర్శిటీ వివాదంలో జోక్యం చేసుకున్నందుకు మిశ్రాను రాజీనామా చేయాలని ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. లేటేస్ట్‌గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివ రెడ్డి కూడా మనన్ మిశ్రాను రాజీనామా చేయాలని కోరారు. ఈ సందర్భంగా మనన్ మిశ్రాపై సదాశివ రెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
రూ.150 కోట్ల బార్ కౌన్సిల్ నిధులను మిశ్రా పక్కదారి పట్టించారని ఆరోపించారు. అంతేకాకుండా బార్ కౌన్సిల్ దాని అనుబంధ సంస్థల్లో ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో కాకుండా మిశ్రా తన కుటుంబ సభ్యులను.. తనకు నచ్చిన వాళ్లను కీలక పదవుల్లో నియమించారని ఆరోపణలు చేశారు. నల్సార్ లా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌పై మిశ్రా నిషేధం విధించడం బిసిఐ ప్రతిష్టను దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బార్ కౌన్సిల్‌ను సంప్రదించకుండానే మిశ్రా ఈ వివాదస్పద ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా బిసిఐలో తిష్ట వేసిన మిశ్రా వ్యవస్థను భ్రష్టుపట్టించారని విమర్శించారు. మిశ్రా 15 రోజుల్లోగా బిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం విధించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బిసిఐ ట్రస్ట్ పెర్ల్-ఫస్ట్ ఖాతాలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
లా కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి బిసిఐ లేదా దాని అనుబంధ సంస్థలు విరాళాల స్వీకరణ తక్షణమే ఆపాలని కోరారు. బిసిఐ ఏ ఒక్క వ్యక్తి ప్రైవేట్ సంస్థ కాదని.. పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టించబడిన ఒక శాసనబద్ధ సంస్థ అని నొక్కిచెప్పారు. బిసిఐకి లక్షలాది మంది న్యాయవాదుల ప్రయోజనాలకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.
నల్సార్ వివాదం అంటే ?
నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సిజెఐ జస్టిస్ సూర్య కాంత్‌ను ఆహ్వానించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించడంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నల్సార్ 2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియపై తాత్కాలికంగా నిషేధం విధించింది. విద్యార్థుల చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా, వృత్తి ప్రమాదకర ధోరణిగా పేర్కొంటూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నల్సార్ నుంచి పట్టభద్రులయ్యే ఏ విద్యార్థిని కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్స్ అన్నీ న్యాయవాదిగా నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. బిసిఐ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 24 గంటల వ్యవధిలోనే బిసిఐ వివాదస్పద ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.







కామెంట్‌లు (0)