శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం

1 గంట క్రితం

State-of-the-art cancer treatment center at Kakinada GGH, thanks to Pawan Kalyan's efforts.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

...రూ.36.6 కోట్లతో రేడియోథెరపీ లీనాక్ యంత్రం, రూ.3.5 కోట్లతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ఏర్పాటు

...కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి


ప్రజాశక్తి-కాకినాడ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటు కానుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం క్యాన్సర్ రిఫరల్ కేంద్రంగా మాత్రమే సేవలందిస్తున్న కాకినాడ జీజీహెచ్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి గత రెండేళ్లుగా తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఇందులో భాగంగా పలుమార్లు జీజీహెచ్‌ను సందర్శించి వైద్యులతో చర్చించడంతో పాటు, పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కలిసి కాకినాడలో అధునాతన క్యాన్సర్ చికిత్సా సదుపాయాల అవసరాన్ని వివరించినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ, నిరంతర సంప్రదింపులతో ఓఎన్జీసీ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ (లీనాక్) యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని ఎంపీ తెలిపారు. లీనాక్ యంత్రం అందుబాటులోకి రావడంతో రేడియోథెరపీ వంటి అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు కాకినాడ జీజీహెచ్‌లోనే అందుబాటులోకి రానున్నాయని, కాకినాడతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, పోలవరం తదితర ప్రాంతాల క్యాన్సర్ రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. దీంతో పాటు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రూ.3.5 కోట్ల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. అలాగే రెడ్‌క్రాస్ సంస్థ రూ.7 కోట్ల వ్యయంతో చేపట్టిన అధునాతన క్యాన్సర్ చికిత్సా భవన నిర్మాణం కూడా తుది దశకు చేరుకుందన్నారు. రెండు దశాబ్దాలుగా ఆధునికీకరణకు నోచుకోని కాకినాడ జీజీహెచ్ ఆంకాలజీ విభాగానికి ఈ ఆధునిక సదుపాయాలు కొత్త బలాన్ని అందించనున్నాయని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల రోగులకు ఈ కేంద్రం ఎంతో ఉపశమనాన్ని కలిగించనుందని తెలిపారు. కాకినాడలోనే అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం మరింత బలోపేతం కానుందని అన్నారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఓఎన్జీసీ సంస్థ, రెడ్‌క్రాస్ యాజమాన్యానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్