పొంగుతున్న డ్రైనేజీలు
చినకాకాని, కాజా వద్ద రహదారులపైకి చేరిన వర్షపు నీరు.. వాహనదారులకు ఇబ్బందులు
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : మంగళగిరి ప్రాంతంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వర్షపు నీరు రహదారులపైకి చేరి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా చినకాకాని హాయ్‌ల్యాండ్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి వెంబడి చినకాకాని వద్ద ఉన్న డ్రైనేజీ కల్వర్టులు పొంగిపొర్లడంతో నీరు రహదారులపైకి చేరుతోంది. మరోవైపు ఎన్నారై వై జంక్షన్ వద్ద కాజా, వెంకటరెడ్డిపాలెం ప్రాంతాల్లో వంతెనల కింద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాజా టోల్‌గేట్ వద్ద కూడా కొంతమేర వర్షపు నీరు రహదారిపైకి చేరింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లడంతో ట్రాఫిక్‌పై కూడా ప్రభావం పడుతోంది. వర్షాలు మరింత కొనసాగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం కావాలని స్థానికులు కోరుతున్నారు. నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని, రహదారులపై నిలిచిన వర్షపు నీటిని త్వరితగతిన తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.







కామెంట్‌లు (0)