ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : అసెంబ్లీ, సచివాలయంలో పనిచేసే హౌస్ కీపింగ్ కార్మికులకు జీతాలు పెంచకపోతే సమ్మె అనివార్యమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజధానిలోని మల్కాపురం సెంటర్ వద్ద అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని అసెంబ్లీ, సచివాలయం హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 2019లో హౌస్ కీపింగ్ కార్మికులకు వేతనాలు పెంచారని,ఏడేళ్ల లో నిత్యవసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు, ఇతర అన్ని రకాల ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగాయని కార్మికుల వేతనం మాత్రం పెరగలేదని అన్నారు. ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య కార్మికులకు రూ 21వేలు ఇస్తున్నారని, అదే పని చేస్తున్న అసెంబ్లీ, సచివాలయ హౌస్ కీపింగ్ కార్మికులకు మాత్రం రూ10,470లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. జీతాలు పెంపు కోసం ఇప్పటికే మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కె సురేష్ కుమార్, సి ఆర్ డి ఎ కమిషనర్ విజయరామరాజు ను కలిసి సమస్య తెలియజేశామని అన్నారు. వారు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. జీతాలు పెంపు జరగకపోతే కార్మికులకు సమ్మెబాట తప్ప మరో మార్గం లేదని, జీతాలు పెంపు జరగకపోతే సమ్మె చేపడతామని, దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఎకరం 99 పైసలకే ఇస్తున్న పాలకులు కార్మికుల వేతనాలు మాత్రం పెంచడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని నిలదీశారు.ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కార్మికులకు కనీస వేతనాలు ఎందుకు అమలు జరపడం లేదన్నారు. అసెంబ్లీ, సచివాలయం హౌస్ కీపింగ్ కార్మికులకు రూ 21 వేల వేతనం ఇవ్వాలని అన్నారు. సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం రవి, బి లక్ష్మణరావులు మాట్లాడుతూ, కనీస వేతనాలు పెంపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. జూలై 30న కనీస వేతనాల పెంపు కోసం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె గ్రేస్, సుజాత,బుజ్జి, బుల్లమ్మాయి, ఇందిరా,పుష్ప, కోటేశ్వరి, అమ్ములు,భవ్య, చిట్టిబాబు, వీరయ్య, ఏసుబాబు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీతాలు పెంచకపోతే సమ్మె తప్పదు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 05:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)