జులై 20న నిరసనలకు సిపిఎం పిలుపు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం దారుణమని తెలిపారు. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా దేశ పరీక్షల వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా 21 రోజుల దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యమం ఆగిపోకుండా కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ అఖిలభారత నాయకులు ఆదర్శ్ ఎం సాజి, ఐషీ ఘోష్ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించడం హర్షణీయమని, ఇప్పటికే సిపిఎం సీనియర్ నాయకులు బృందాకరత్ వారికి సంఘీబావం ప్రకటించారని తెలిపారు. పరీక్షా విధానంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆందోళన చేస్తున్న నాయకులతో చర్చించాలని పార్లమెంట్ సమావేశాల్లోగా కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, లేనిపక్షంలో బర్తరఫ్ చేయాలని కోరారు. ఇకనైనా ప్రవేశ పరీక్షలు సవ్యంగా జరగడానికి వీలుగా వికేంద్రీకరించాలని డిమాండు చేశారు. వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా, దీక్ష భగ్నానికి నిరసనగా జూలై 20వ తేదీన రాష్ట్రమంతా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 








కామెంట్‌లు (0)