మరో నాలుగు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు మాత్రమే ఎన్నికలు
ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి ధ్రువపత్రాల అందజేత
ప్రజాశక్తి - చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని 55 గ్రామ పంచాయతీలకు మూడో దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చిలకలూరిపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. మరో నాలుగు గ్రామాల్లో వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, సర్పంచ్ పదవులకు మాత్రమే ఈ నెల 22న ఎన్నికలు జరగనున్నాయి.
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జువాజి మదన్, బండారుపల్లి సత్యనారాయణ గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేందుకు ఇరు వర్గాలను ఒప్పించి, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే అవార్డులు సాధించేందుకు కృషి చేసినట్లు సమాచారం.
మండలంలో ఏకగ్రీవమైన 10 గ్రామ పంచాయతీల్లో వేల్పుల గ్రామానికి మొత్తయ్య, ఎడవల్లికి తూబాటి కిషోర్, లింగంగుంట్లకు షేక్ షహీదా, మద్దిరాలకు గంజి లక్ష్మీ, రాజాపేటకు గోరంట్ల తిరుపతయ్య, గంగన్నపాలెంకు పాములపాటి నారద, గొట్టిపాడుకు విప్పర్ల సిలువమ్మ, దండమూడికి వాచినేని రామకోటయ్య, గోవిందపురానికి కత్తి జ్యోతి, కమ్మవారిపాలెంకు మురికిపూడి రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామచంద్రపురం గ్రామం కూడా ఏకగ్రీవమైనట్లు సమాచారం.
ఈ పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లను కూడా ఎన్నుకున్నారు. మానుకొండవారిపాలెం, కట్టుబడివారిపాలెం, గోపాలంవారిపాలెం, కోమటిలేనివారిపాలెం గ్రామాల్లో వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నాలుగు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు మాత్రమే ఈ నెల 22న ఎన్నికలు జరగనున్నాయి.








కామెంట్‌లు (0)