- ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సిఎం చంద్రబాబు చెప్పారు. రాజధానిలోని తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు బుధవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ సుధా, వెంకట్ జాస్తి క్యాంపస్ పేరుతో 12 ఎకరాల్లో ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ... కంటి చికిత్సలతో పాటు పరిశోధన, శిక్షణ రంగాల్లోనూ ప్రపంచస్థాయి కేంద్రంగా ఎల్‌వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఎదగాలని కోరారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న జిఎన్ రావు, జాస్తి వెంకట్‌ను అభినందించారు. అమరావతిలో హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌లో భాగంగా బసవ తారకం కేన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థలు వస్తున్నాయని, ఎఐ, ల్యాబొరేటరీ ఆటోమేషన్, ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ, క్వాంటం బయో వ్యాలీగా అమరావతి అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వచ్చే నెల మూడున విజయవాడలో పాన్-ఐఐటి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దేశంలోని వివిధ ఐఐటిల్లో చదివి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొని మేధోమధనం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)