ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్
వాతావరణంలో ఏర్పడే ఎల్‌నినో వంటి పరిస్థితులను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టాలను కొంతమేర తగ్గించవచ్చని కెఎల్ యూనివర్శిటీ సి ఎస్ ఈ 4 విభాగాధిపతి డాక్టర్ టి.పవన్ కుమార్ తెలిపారు. బుధవారం ఎం టి ఎం సీ పరిధిలోని గుండిమెడ గ్రామంలో సీఎస్ఈ-4 ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి “ఎల్‌నినో పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు – సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ అవగాహన” అంశంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, వర్షపాతం తదితర వాతావరణ అంశాల్లో చోటుచేసుకునే మార్పులపై వివరించారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవడం ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండవచ్చని, మొబైల్ యాప్స్, వెదర్ అలర్ట్స్, డిజిటల్ టెక్నాలజీ, వాట్సాప్ వంటి సాధనాల ద్వారా సమాచారాన్ని వేగంగా చేరవేయవచ్చని పేర్కొన్నారు. రైతులు వర్ష సూచనలు, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ వంటి వివరాలను తెలుసుకుని విత్తనాలు విత్తడం, ఎరువులు, పురుగుమందుల వినియోగం, పంట కోత, నీటి నిర్వహణ వంటి పనులను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. వాతావరణానికి అనుగుణంగా పంటలు, పశువుల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ఫీల్డ్ కోఆర్డినేటర్ పి.సురేష్ సమన్వయకర్తగా వ్యవరహించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లను యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ, ప్రోవైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ కెఆర్ఎస్.ప్రసాద్, సలహాదారులు డాక్టర్ హబీబుల్లా ఖాన్, అసోసియేట్ డీన్ డాక్టర్ శాంతిశ్రీ తదితరులు అభినందించారు.








కామెంట్‌లు (0)