రాజధాని నిర్మాణానికి పొలాలు ఇచ్చాం.. స్థలాలు కూడా ఇవ్వాలా..? అని అధికారులను దొండపాడు గ్రామస్తులు నిలదీశారు. అమరావతి రాజధాని నగర నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్వహించే భూసేకరణ నిమిత్తం ‘ఆర్ అండ్ ఆర్ కార్యాచరణ’ పేరుతో గురువారం వెలగపూడి, దొండపాడులో గ్రామసభలు నిర్వహించారు. దొండపాడు గ్రామ సభలో ల్యాండ్ అక్విజేషన్ (భూసేకరణ) అధికారి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే 0.73 సెంట్లు భూసేకరణలో ఇవ్వగా మరో 2.04 ఎకరాలు పెండింగ్‌లో ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల నిమిత్తం భూసేకరణ ద్వారా స్థలాలు తీసుకుంటామని చెప్పారు. గ్రామస్తులు తమ స్థలాలను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చినా సమ్మతమేనన్నారు. స్థలాలు పోవడం వల్ల జీవనోపాధికి ఇబ్బంది కలిగితే పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రాథమికంగా ఎంత పరిహారం చెల్లించాలనే వివరాలు గ్రామ సచివాలయాలు, తహశీల్ధార్ కార్యాలయాల్లో ఉంచామని తెలిపారు. అవార్డు కమిటీ పరిశీలన అనంతరం పరిహారానికి సంబంధించిన తుది జాబితాను రూపొందిస్తామని వివరించారు. దీనిపై బండి జార్జి, మరికొందరు గ్రామస్తులు మాట్లాడుతూ పొలాలు ఇచ్చాం.. ఇప్పుడు స్థలాలు కూడా ఇవ్వాలా..? మా స్థలాలలో పంచాయతీ రోడ్లు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.. మీరిప్పుడు స్థలాలు తీసుకొని మాకు ఏం న్యాయం చేస్తారు..? అని ప్రశ్నించారు. గ్రామసభలకు మంత్రి నారాయణతో పాటు సిఆర్డిఎ కమిషనర్, జిల్లా రెవెన్యూ అధికారులు వచ్చేవారు.. ఇప్పుడు మీరు మాత్రమే వచ్చారు.. మీరు మరోచోటకు బదిలీపై వెళ్లి వేరే అధికారి వచ్చి ఇంకోరకంగా చెబుతారు.. గ్రామసభల వల్ల ఒనగూడేదేమి లేదు.. అని అన్నారు. పరిహారం, ఇతర అంశాలపై గ్రామస్తులు లేవనెత్తిన అభ్యంతరాలపై అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ‘నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా..’ అని ల్యాండ్ అక్విజేషన్ అధికారి అనడంతో గ్రామస్తులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. న్యాయం చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేనప్పుడు గ్రామస్తులకు గ్రామసభ నిర్వహించడం ఇష్టం లేదని పై అధికారులకు చెప్పండని అనడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. స్థలాలు కోల్పోయేవారి అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకొని సభను ముగించారు. సభలో సిఆర్డిఎ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు.
పొలాలు ఇచ్చాం..స్థలాలు కూడా ఇవ్వాలా..?
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 06:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)