ప్రజాశక్తి - తాడేపల్లి
రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు తాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకు, పట్టణానికి గర్వకారణమని టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు అన్నారు. సోమవారం తాడేపల్లి టిడిపి కార్యాలయంలో విద్యార్థులను వెంకట్రావు, నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. తాడేపల్లి జెడ్పీ పాఠశాల నుంచి ముగ్గురు బాలికలు రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువులోనే కాకుండా క్రీడల్లోనూ తాడేపల్లి విద్యార్థులు ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. పాడేరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు విజయం సాధించి పట్టణానికి మంచి పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల పిడి రజని నాయక్ మాట్లాడుతూ71వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. బాలికల విభాగంలో పరస స్నేహిత, లక్ష్మీ దుర్గ, కావ్యఎంపికయ్యారని వెల్లడించారు. వీరిలో లక్ష్మీ దుర్గ బెస్ట్ సెటర్‌గా ఎంపిక కావడం విశేషమన్నారు. అదేవిధంగా బాలుర విభాగంలోనూ తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారా దాసు, అద్దంకి మురళి, కేళి వెంకటేశ్వరరావు, మండవ గోపాలరావు, బుర్రముక్కు శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి, కొర్రపాటి విజయ్ కుమార్, కేళి కరుణకర్, పుల్లెపు భాస్కర్ రావు, చింకా శ్రీను,నవీన్, కొక్కిలిగడ్డ సుబ్బారావు, చుంచు లక్ష్మీనారాయణ, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)