గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలి

1 గంట క్రితం

champ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 02:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేయాలి

- కలెక్టర్ హరేంధిర ప్రసాద్

- పతక విజేతలకు ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్‌ షూస్‌ పంపిణీ

ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర స్థాయి విజయాలతో సంతృప్తి చెందకుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌-2026లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన కాకినాడ జిల్లా క్రీడాకారులకు గురువారం కాకినాడ క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఒలింపిక్ పతక విజేత కె. రజినితో కలిసి ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్‌ షూస్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన 386 మంది బాలబాలికలు 12 క్రీడాంశాల్లో అండర్‌-17, అండర్‌-23 విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని తెలిపారు. జట్టు ఈవెంట్లలో మూడు ప్రథమ, మూడు ద్వితీయ స్థానాలు, వ్యక్తిగత విభాగాల్లో నాలుగు ప్రథమ, ఏడు ద్వితీయ స్థానాలు సాధించారని పేర్కొన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ, నాలుగు రజతాలు, చెస్‌లో స్వర్ణ, రజత పతకాలు సహా కోకో, హాకీ, బ్యాడ్మింటన్‌, యోగా, బాక్సింగ్‌ తదితర విభాగాల్లో పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల విజయాల వెనుక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, శిక్షకుల మార్గదర్శకత్వం కీలకమని కలెక్టర్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణా పద్ధతులను అందిపుచ్చుకుని లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి నిరంతరం సాధన చేయాలని సూచించారు.

గ్రామస్థాయి నుంచే ప్రోత్సాహం అవసరం

ఒలింపిక్ పతక విజేత కె. రజిని మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరన్నారు. జిల్లా యంత్రాంగం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని మరింత కష్టపడి సాధన చేయాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్‌కుమార్ మాట్లాడుతూ పతకాలు సాధించిన 72 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లు అందించినట్లు తెలిపారు. పతక విజేతలకు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయని పేర్కొన్నారు. జట్టు ఈవెంట్లలో ప్రథమ స్థానానికి రూ.లక్ష, ద్వితీయ స్థానానికి రూ.50 వేలు, వ్యక్తిగత విభాగాల్లో ప్రథమ స్థానానికి రూ.20 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10 వేల చొప్పున అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల శిక్షకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్