ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

71 వేల హెక్టార్లలో వరి సాగు

6 రోజుల క్రితం

71 వేల హెక్టార్లలో వరి సాగు
​ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 09:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : ​రానున్న రబీ సీజన్‌లో కాకినాడ జిల్లాలో 71 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ఎంఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి గోదావరి ఈస్ట్రన్ డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పిబిసి), ఏలేరు ప్రాజెక్టుల ద్వారా సాగు నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,90,865 ఎకరాల ఆయకట్టులో శివారు భూములకూ నీరందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. రబీ సాగునీటి విడుదల, వరి సాగు విస్తీర్ణం, ఎరువులు, విత్తనాల లభ్యత తదితర అంశాలపై జిల్లా ఇరిగేషన్ సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ వివరించారు.

​డిసెంబర్ 1 నుంచి సాగునీటి విడుదల

​గోదావరి ఈస్ట్రన్ డెల్టా పరిధిలో 1,05,341 ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 32,507 ఎకరాలు, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 53,017 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,90,865 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ​గోదావరి ఈస్ట్రన్ డెల్టాలో సాధారణ పరిస్థితులతో పోలిస్తే సుమారు 15 శాతం నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, వంతులవారీ విధానం అమలు చేయడం, డ్రైనేజీలకు క్రాస్ బండ్లు వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని అందిస్తామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.

​ రబీ సీజన్‌కు జిల్లాలో సుమారు 78 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 36,738 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 14,288 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి మొదటి వారానికి అవసరమైన నిల్వలను సమకూరుస్తామని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా మొబైల్ అప్లికేషన్ విధానంలో పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తామన్నారు. రైతులకు ప్రత్యేక కార్డులు జారీ చేసి మూడు విడతల్లో ఎరువులు అందించే విధానం అమలు చేస్తామని తెలిపారు.

​ విత్తనాల కొరత లేకుండా చర్యలు

​రబీ వరి సాగుకు 35 వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే రైతుల వద్ద 25 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన 10 వేల మెట్రిక్ టన్నుల విత్తనాల కోసం ఆర్డర్లు ఇచ్చామని, రైతులకు కొరత లేకుండా సరఫరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

​ ​ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా సాధన వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని, ప్రభుత్వం కొనుగోలు చేసే రకాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మార్చి నెలాఖరు నాటికి పంట కోతలు పూర్తయ్యేలా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వీలున్న ప్రాంతాల్లో నేరుగా విత్తనాలు చల్లే (డైరెక్ట్ సీడింగ్) విధానాన్ని అనుసరించాలని సూచించారు.

రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ డిసెంబర్ 31వ తేదీలోపు నాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సాగునీరు, ఎరువులు, విత్తనాల పంపిణీలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ కుమారి ప్రియ, జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్