కూటమి బలంగా ఉండాలి
రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో పవన్ కళ్యాణ్
త్వరలో పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నానని జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక. అందుకోసం ఎవరి గౌరవానికి భంగం వాటిల్లకుండా అందరం కలిసి పని చేయాలి. ముఖ్యంగా జనసేన పార్టీ గౌరవానికి భంగం వాటిల్లకుండా ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో క్యాంపు ఆఫీసును పిఠాపురంలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాం’ అని పేర్కొన్నారు. మంగళవారం పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... పిఠాపురం అభివృద్ధికి మరో రూ.1,500 కోట్లు వెచ్చించామని తెలిపారు.రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా, అభివృద్ధికి నమూనాగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు రాష్ట్ర అభివృద్ధి కే కాకుండా దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచిందని చెప్పారు. 600కు పైగా సీసీ, బీటీ రోడ్లు పూర్తి చేశామని, అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికే రూ.200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి, ఇప్పటికే 600 కు పైగా సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

తాజాగా మరో 202 రహదారులను ప్రారంభించమన్నారు. దాదాపు రూ.10 కోట్లతో నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ఆధునీకరించి, 97 వేల మందికి తాగునీటి భరోసా కల్పించామని, గ్రామాల్లో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో దాదాపు రూ.320 కోట్లతో, పట్టణాల్లో అమృత్ 2.0, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సహకారంతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో దాదాపు రూ.140 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నామన్నారు. పిఠాపురంతోపాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా రూ.34 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయన్నారు.యు.కొత్తపల్లి, చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద డిస్పెన్సరీ ఏర్పాటు చేశాం. రూ.7 కోట్లతో 26 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు గ్రామ ఆరోగ్య కేంద్రాలను పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (పాడా) నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రూ.45 కోట్లతో కాకినాడ జీజీహెచ్ లో ఆంకాలజీ బ్లాక్ , అధునాతన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం.• రూ. 225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పిఠాపురం ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచేందుకు రూ.34 కోట్లతో ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ సహకారంతో 48 భజన మందిరాలు నిర్మిస్తున్నాం. రూ.2 కోట్లతో శ్రీ కుంతీమాధవస్వామి ఆలయ కోనేరు పునరుద్ధరిస్తున్నాం. పక్కనే ఉన్న రథాలపేటలో మారెమ్మ గుడిని పునర్నిర్మించి, ఖాళీ ప్రదేశాన్ని సుందరవనంగా అభివృద్ధి చేస్తున్నాం. గత పర్యటనలో పిఠాపురం పట్టణంలో మురుగు, చెత్త సమస్యను చూశాను. రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోజుకు 72 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 40 టన్నుల తడి చెత్త శుద్ధి ప్లాంట్ ను, 5 చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొగలి సూర్యుడి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించాం. కాలుష్య నియంత్రణ మండలి నిధులతో బేలింగ్ మెషిన్ కాంపాక్టర్ అందుబాటులోకి తెచ్చాం.

రూ.323 కోట్లతో ఉప్పాడ తీరానికి రక్షణ కవచం
రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధింఛామన్నారు. దీనికి సంబంధించిన డిజైన్, సర్వేను ఐఐటీ మద్రాస్ పూర్తి చేసిందని, ఇక నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. పిఠాపురం నడిబొడ్డున పీఎం గతి శక్తి పథకం కింద రూ.118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఆమోదం లభించిందన్నారు. సాస్కి నిధులతో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి, అమృత్ భారత్ పథకం కింద రూ.37 కోట్లతో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పాడా నిధులతో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ద్వారా రూ.20 కోట్లతో ఆధునిక బస్సు స్టాండ్, రూ.3 కోట్లతో 4 స్మార్ట్ కిచెన్లు, చేపల మార్కెట్, సిసి డ్రైన్లు, పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పంచాయతీ భవనాలు, ఉప్పాడ చేనేత కమ్యూనిటీ హాళ్లు , అంగన్‌వాడీ కేంద్రాలు వంటి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ కళాశాలకు సుమారు రూ. 4 కోట్లతో కొత్త భవనాలు, కాంపౌండ్ వాల్స్, అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్ లెవెలింగ్ పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. సభ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన అధికారులతో కల్సి పరిశీలించారు.

విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేత
వేదికపై 32 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. యు. కొత్తపల్లి మండలానికి చెందిన 1,258 మంది మత్స్యకారులకు ఈ సేఫ్టీ కిట్లను అందజేశారు. 76 మంది మత్స్యకారులకు డ్రై ఫిష్ యూనిట్లు, 30 మందికి కెనటిక్ హోండాలను, ముగ్గురుకి ఆటోలు అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు మంజూరుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు నివాస గృహాల క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కౌడా ఛైర్మన్ సత్య తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)