ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు వీల్లేదు
ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భద్రత పొందుతున్న వ్యక్తులను ఎన్నికల ఏజెంట్లుగా, పోలింగ్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లికార్జున నవంబర్ శనివారం లేఖ రాశారు. ఈ ఏడాది మార్చి 26న జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 172/ఎస్ఈసీ-ఎఫ్1/2026 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ), ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఎన్నికల జనరల్ ఏజెంట్లుగా గుర్తింపు కార్డులు పొందడంపై వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వీరు నవంబర్ 26న పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన మేయర్ అభ్యర్థి ఆకుల భవానికి ఎన్నికల ఏజెంట్‌గా ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహరించినట్లు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన నమూనా సంతకాల జాబితాలో నమోదైందని సత్యశ్రీ వెల్లడించారు. అలాగే ఏడో నంబరు అభ్యర్థికి ఎన్నికల ఏజెంట్‌గా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పేరు కూడా అదే జాబితాలో ఉన్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ నెల 30న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు ఏజెంట్లుగా పాల్గొంటే కౌంటింగ్ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని సత్యశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులను ఏజెంట్లుగా నియమించకూడదని 2009 ఏప్రిల్ 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సంబంధిత ప్రజాప్రతినిధులకు జారీ చేసిన జనరల్ ఏజెంట్ గుర్తింపు కార్డులను రద్దు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదని, ఇదే నిబంధన కౌంటింగ్ కేంద్రాలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆయుధాలతో ప్రవేశించడంపై ఉన్న చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని సర్క్యులర్‌లో పేర్కొంది. కాగా సత్యశ్రీ చేసిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్‌కు పంపిన ఎన్నికల సంఘం, నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో నవంబర్ 30న జరగనున్న కాకినాడ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు ఏజెంట్లుగా పాల్గొనే అంశంపై ఎన్నికల సంఘం ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








కామెంట్‌లు (0)