- ఎస్పీ బిందుమాధవ్
- 269 మంది కానిస్టేబుళ్లకు 45 రోజుల ప్రత్యేక శిక్షణ ప్రారంభం
ప్రజాశక్తి-కాకినాడ: ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి కాకినాడ జిల్లా పోలీసు శాఖలో రిపోర్ట్ చేసిన 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల జిల్లా ప్రత్యేక శిక్షణ గురువారం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాకు రిపోర్ట్ చేసిన వారిలో 189 మంది పురుషులు, 80 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. మహిళా కానిస్టేబుళ్లు ఈ నెల 5న, పురుష కానిస్టేబుళ్లు 7న జిల్లా పోలీసు శాఖలో రిపోర్ట్ చేశారు. ప్రాథమిక శిక్షణలో పొందిన నైపుణ్యాలను జిల్లా స్థాయిలో విధులకు అనుగుణంగా మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. 45 రోజుల శిక్షణలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్టాలు–నిబంధనలపై అవగాహన, పోలీస్‌స్టేషన్లలో విధుల నిర్వహణ, ప్రజలతో వ్యవహరించే విధానం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే వివిధ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవసరమైన నైపుణ్యాలను కానిస్టేబుళ్లలో పెంపొందించనున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ పోలీసు విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, సమయపాలన, బాధ్యతాయుత ప్రవర్తన అత్యంత ముఖ్యమన్నారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, చట్టపరిధిలో వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీసు శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని కోరారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ విధులకు సమర్థవంతంగా సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) డా. మహంతి కిషోర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు, ఆర్‌ఐలు ఎం. నరసింహమూర్తి, కె. వెంకటరావు, పోలీసు అధికారులు, శిక్షణ సిబ్బంది, 269 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)