- బాధిత కుటుంబాలకు ఎంపీపీ గంటా విజయకుమార్ భరోసా
- పవన్ కల్యాణ్ దృష్టికి ఘటన..
- కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతర సమన్వయం
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి(కాకినాడ): ఉప్పాడ శివారు సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం యు.కొత్తపల్లి మండల ఎంపీపీ గంటా విజయకుమార్ బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మత్స్యకారులు గల్లంతైన విషయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లిందని తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సముద్రంలో గాలింపు చర్యలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరం కొనసాగించాలని సంబంధిత అధికారులను కోరారు. పది రోజులుగా ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రజాప్రతినిధుల పరామర్శ కొంత ధైర్యాన్ని ఇచ్చింది.







కామెంట్‌లు (0)