బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తగ్గని వాయు కాలుష్యం.. పలు ప్రాంతాల్లో 300 దాటిన ఏక్యూఐ

26 నిమిషాల క్రితం

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తగ్గని వాయు కాలుష్యం.. పలు ప్రాంతాల్లో 300 దాటిన ఏక్యూఐ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వాయు కాలుష్యం తీవ్రత బుధవారం కూడా కొనసాగింది. ఉదయం వేళల్లో ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 228గా నమోదై 'పేలవ' (పూర్) కేటగిరీలో కొనసాగుతోంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి రెండు దశల ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత 300 మార్కును దాటి 'అత్యంత పేలవ' (వెరీ పూర్) స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


హాట్‌స్పాట్‌లుగా ఆనంద్ విహార్, అక్షరధామ్:

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఉదయం 7 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆనంద్ విహార్ 336 ఏక్యూఐతో అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) వద్ద 331, సిరి ఫోర్ట్ 330, అక్షరధామ్ ఆలయ పరిసరాల్లో 327, నార్త్ క్యాంపస్‌లో 314 చొప్పున ఏక్యూఐ నమోదైంది. ఇగ్నో-మైదాన్ గర్హి, బురారీ క్రాసింగ్ ప్రాంతాల్లో 304 చొప్పున రికార్డయింది.


చాందినీ చౌక్ (275), ఐఐటీ ఢిల్లీ (254), వివేక్ విహార్ (251), అశోక్ విహార్ (224) ప్రాంతాలు 'పేలవ' కేటగిరీలో ఉండగా.. ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో కాలుష్యం కాస్త తక్కువగా (161 ఏక్యూఐ - మోస్తరు కేటగిరీ) నమోదైంది.


పొరుగు నగరాల్లోనూ అదే పరిస్థితి:

ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్‌సీఆర్ నగరాల్లోనూ వాయు నాణ్యత క్షీణించింది. ఘజియాబాద్‌లో సగటు ఏక్యూఐ 240గా నమోదు కాగా, లోనీలోని వేద్ విహార్‌లో అత్యధికంగా 348 ఏక్యూఐ రికార్డయింది. నోయిడాలో సగటున 215 నమోదైనప్పటికీ, సెక్టార్-62లో 346, సెక్టార్-143లో 306 ఏక్యూఐ నమోదవడం గమనార్హం. గ్రేటర్ నోయిడాలో ఏక్యూఐ 209గా ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 200 వద్ద ఉండగా, గాలిలో పీఎం 2.5 రేణువుల ప్రభావం అధికంగా ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది.


సీఏక్యూఎం సమీక్ష, చర్యలు:

కాలుష్య నియంత్రణకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా 'గ్రాప్-2' ఆంక్షలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా యంత్రాలతో రహదారులను శుభ్రం చేయడం, దుమ్ము అణచివేతకు నీటిని చల్లడం, నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు, సీఏక్యూఎం సభ్య కార్యదర్శి తరుణ్ కుమార్ పిథోడ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లతో శీతాకాలపు కాలుష్య నియంత్రణ చర్యలు మరియు 'జిల్లా కార్యాచరణ ప్రణాళికలు-2027'పై సమీక్ష నిర్వహించారు. ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయి ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఆంక్షలు అమలవుతున్నప్పటికీ కాలుష్య తీవ్రత తగ్గకపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్