- 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
- కాకినాడలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వాక్ ఫర్ డెమోక్రసీ
ప్రజాశక్తి–కాకినాడ : భారతదేశంలో ఓటుహక్కు ప్రతి భారతీయుడి జన్మహక్కని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాకినాడలోని గాంధీ పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వివిధ ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదుల ఆధ్వర్యంలో ‘వాక్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర వర్మ, అంబేడ్కర్ ఉద్యమ నేతలు అయితాబత్తుల రామేశ్వరరావు, పిల్లి రామారావు, సామాజిక న్యాయ సాధన సమితి కార్యదర్శి భాషా, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్. వర్మ, సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ నాయకులు అఖల్ అలీ తదితరులు మాట్లాడుతూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి చేరుకునే వందలాది రైలు సర్వీసులను నిలిపివేయడం, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో పాలకులు ఆలోచించారా? అని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వపడుతున్న భారతదేశంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాలు అధికార పార్టీకి అనుబంధంగా మారుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు దేశ ప్రతిష్టను సైతం దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. జరిగిన తప్పిదాలను సరిదిద్దకుండా ఎన్నికల కమిషనర్‌ను బీజేపీ నాయకులు వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రూపొందించబడిందని నాయకులు గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటంలా సాగుతోందని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రజాస్వామ్యవాదులంతా కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. 1923లో భారత జాతీయ కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు కాకినాడ గాంధీ పార్క్ ప్రాంతంలో జరిగాయని గుర్తుచేశారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ముడిపడిన ఆ ప్రాంతం నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను ప్రారంభించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సిహెచ్. రాజ్‌కుమార్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, శ్రామిక మహిళలు సిహెచ్. వేణి, ఎం. నాగలక్ష్మి, జి. వెంకటలక్ష్మి, మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు దుంపల ప్రసాద్, శ్రీరాం, అంబేడ్కర్ ఉద్యమ నేతలు కాశి రామారావు, టి. నూకరాజు, తాడి బాబ్జి, జన విజ్ఞాన వేదిక నాయకులు కెఎంఎంఆర్ ప్రసాద్, ఎ. సంజయ్, ఐలు నాయకులు కె. నాగజ్యోతి, కె. దమయంతి, ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు కె. సత్తిరాజు, జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, పోర్ట్ యూనియన్ నాయకులు కె. చిట్టిబాబు, డీవైఎఫ్ఐ మాజీ నాయకులు సిహెచ్. విజయ్‌కుమార్, సామాజిక న్యాయ సాధన సమితి నాయకులు పినిపే రాజు, రిటైర్డ్ ఎంప్లాయిస్ మోహన మురళీ, జె.వి. రాఘవరావు, ఉపాధ్యాయులు రమణ, నూకరాజు, నాగాబత్తుల సూర్యనారాయణ, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)