ప్రజాశక్తి-కాకినాడ
విద్యావేత్త, ప్రముఖ సంఘసంస్కర్త రఘుపతి వేంకటరత్నం నాయుడు చిరస్మరణీయుడని పలువురు అన్నారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు (ఆర్.వి.ఎన్) స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గురువారం 164వ జయంతిని నిర్వహించారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద రఘుపతి వేంకటరత్నం విగ్రహానికి అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకరవర్మ, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్.వర్మ సీనియర్ నాయకులు ఎం.సుబ్బారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టడీ సర్కిల్ పూర్వ కన్వీనర్ ఐ.ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రామేశ్వరరావు, ప్రభాకర వర్మ మాట్లాడారు. మచిలీపట్నంలో జన్మించిన వేంకటరత్నం నాయుడు కాకినాడ పిఆర్ కళాశాల ప్రిన్సిపల్ గా తొలిసారి మహిళలకు కళాశాల విద్యకు అవకాశం కల్పించారని తెలిపారు. ఆంధ్రలో బ్రహ్మ సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు. పిఠాపురం రాజాను ఒప్పించి అనాథ ఆశ్రమం ఏర్పాటు చేశారన్నారు. కాకినాడలో బ్రహ్మ సమాజ మందిరం నిర్మించారని తెలిపారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారన్నారు. మద్రాసు యూనివర్సిటీ తొలి తెలుగు వైస్ ఛాన్సలర్ గా పని చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో నేటి సమాజంలో ఉన్న రుగ్మతలపై కృషి చేయాలన్నారు. ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్. గోవిందరాజులు వందన సమర్పణ చేస్తూ కాకినాడ లో యుటిఎఫ్ కేంద్రంగా రఘుపతి వేంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ పనిచేస్తుందని, ప్రతీ నెలా జరిగే సదస్సు లను జయప్రదం చేయాలని నగర ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.ర చక్రవర్తి, సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, పెన్షనర్స్ జోగా అప్పారావు, అర్జునరావు , విశ్వేశ్వరరావు, సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ నాయకులు సలీం, సామాజిక న్యాయ సాధన సమితి నాయకులు పినిపే రాజు, యుటిఎఫ్ నాయకులు శ్రీనివాసాచార్యులు, మరియు నాగాబత్తుల సూర్యనారాయణ, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)