ప్రజాశక్తి-కాకినాడ
కాకినాడ ఎంఎల్ఎ కొండబాబు, మాజీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రోజు విడిచి రోజు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎంఎల్ఎ కొండబాబుపై ప్రత్యారోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై దమ్ముంటే సిబిఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు. అంతే కానీ పసలేని ఆరోపణలు చేయొద్దని
కొండబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తీవ్ర ఒత్తిడికిలోనై దిక్కుతోచని స్థితిలో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం యోగా ప్రాక్టీస్ చేసుకోవాలని హితవు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయని, అలాంటప్పుడు తనపై ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే సిబిఐ విచారణ వేయించుకోమన్నారు. ఆ విచారణ పూర్తయ్యే వరకూ నోరెత్తే అర్హతే లేదన్నారు. కొండబాబు రాజకీయ జీవితానికి పునాది వేసిందే తాను అన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఇవిఎంల సహకారంతో గట్టెక్కి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా?" అంటూ నిప్పులు చెరిగారు. ఎక్కడ చూసినా కొండబాబు ట్యాక్స్, వసూళ్ల దందాయే రాజ్యమేలుతోందన్నారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ జనాన్ని నిలువునా దోచుకుంటున్నారన్నారు. కినాడ ప్రజలు ఆహ్లాదకరంగా గడిపే ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి రూ.30 లక్షలు నొక్కేసింది నిజం కాదా? అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వసూళ్లకు తెగబడటం సిగ్గుచేటన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలంటే కొండబాబుకు దోపిడీకి పండగలా కనిపిస్తోందన్నారు. ఇప్పటికే టిక్కెట్లు కేటాయింపు పేరుతో భారీ వసూళ్లకు తెరతీశారని ఆరోపించారు. కాకినాడ పోర్టులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ, బ్లాక్మెయిల్ దందాల వల్లే ముడి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. ఫలితంగా వేలాది మంది కార్మికులు రోడ్డున పడి అల్లాడుతున్నారన్నారు. ఏటిమొగ నుంచి మూడో వంతెన పేరుతో ఏమాత్రం అవసరం లేకపోయినా భూసేకరణ కోసమే ఏకంగా రూ.300 కోట్లు కాజేయాలనే కుట్రను తాను అడ్డుకున్నాన్నారు. ఇప్పటికైనా దోపిడీలు, బ్లాక్మెయిలింగ్లు కట్టిపెట్టి ప్రజలకు జవాబు చెప్పాలని, లేనిపక్షంలో కాకినాడ నడిబొడ్డున ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కిరణ్, సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి అరుణ్ కుమార్, ఎంజి కిశోర్, గద్దెపల్లి దాసు, సంఘాని నందం, తదితరులు పాల్గొన్నారు








కామెంట్లు (0)