సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారుతున్న జీవనశైలితో క్లోమగ్రంథి వ్యాధుల ముప్పు - జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్

1 గంట క్రితం

మారుతున్న జీవనశైలితో క్లోమగ్రంథి వ్యాధుల ముప్పు
జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 08:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు తీవ్రమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని, క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ యశోద వైద్యశాల జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. క్లోమగ్రంథి వాపు, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన క్లోమగ్రంథి వ్యాధుల లక్షణాలు, కారణాలు, ఆధునిక చికిత్సా విధానాలపై వివరించారు. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో క్లోమగ్రంథి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ అవయవం దెబ్బతింటే జీర్ణక్రియ సమస్యలు, పోషకాహార లోపం, ఆకస్మిక బరువు తగ్గడం, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. క్లోమగ్రంథి వాపు, ప్రాణాంతక కణితి రెండూ వేర్వేరు సమస్యలని, వీటిపై ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. క్లోమగ్రంథి వాపు వచ్చినప్పుడు పొట్ట పైభాగంలో తీవ్రమైన నొప్పి ఏర్పడి వెన్ను వైపు వ్యాపిస్తుందని, వాంతులు కూడా అవుతాయన్నారు. ఇలాంటి లక్షణాలను సాధారణ గ్యాస్, అసిడిటీ సమస్యలుగా భావించి మందుల దుకాణాల్లో సొంత వైద్యం చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. మద్యపానం ఒక్కటే ఈ వ్యాధికి కారణం కాదని, పిత్తాశయంలో రాళ్లు , రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండటం వల్ల కూడా ఇది రావచ్చని చెప్పారు. మద్యం సేవించని వారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చని, బాధితులపై అపోహలు చూపకూడదని సూచించారు. చాలావరకు దీనికి మందులు, ద్రవాలు, పోషకాహారం అందించడం ద్వారా నయం చేయవచ్చని, ప్రతి రోగికీ శస్త్రచికిత్స అవసరం ఉండదని, క్లిష్ట పరిస్థితుల్లో ఎండోస్కోపీ ద్వారా పెద్ద కోత లేకుండానే చీము, ద్రవాలను తొలగించవచ్చని చెప్పారు. క్లోమగ్రంథి క్యాన్సర్ ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చని, కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, పచ్చకామెర్లు రావడం, మూత్రం ముదురు రంగులోకి మారడం, మలం తెల్లగా రావడం, పొట్టతోపాటు వీపు భాగంలో నిరంతర నొప్పి, కొత్తగా మధుమేహం బయటపడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు, మద్యపానానికి దూరంగా ఉండటంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ద్వారా క్లోమగ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగ నిర్వాహకుడు కె. సతీష్, ఉన్నత కార్యనిర్వాహకుడు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్