ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వారం రోజుల్లోనే చోరీ కేసు ఛేదన- ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు

5 రోజుల క్రితం

వారం రోజుల్లోనే చోరీ కేసు ఛేదన
ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
రూ.10 లక్షల నగదు, 9 వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పి ఎం.కిషోర్ కుమార్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 06:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రూ.10 లక్షల నగదు, 9 వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పి ఎం.కిషోర్ కుమార్


ప్రజాశక్తి - కాకినాడ

కాకినాడ గోల్డ్ మార్కెట్ వీధిలోని బంగారం, వెండి ఆభరణాలను కరిగించే దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కాకినాడలోని డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పి ఎం.కిషోర్ కుమార్, డిఎస్పి ఎన్‌ఎస్‌వికె దుర్గారావుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. గోల్డ్ మార్కెట్ వీధిలోని ఓ దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.10 లక్షల నగదుతో పాటు మూడు కిలోల వెండి కడ్డీలను అపహరించారు. దీనిపై కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై ఎస్పి జి.బిందు మాధవ్ ప్రత్యేక దృష్టి సారించగా, డిఎస్పి దుర్గారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నేరస్థలంలో లభించిన వేలిముద్రలను సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించి, నవంబరు 17న నిందితుడిని గుర్తించారు. మూడో పట్టణ సిఐ కెవిఎస్ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి సూర్యనారాయణపురంలోని నివాసం వద్ద ఏ-1 నిందితుడు బీర దుర్గా వెంకటేష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద గంజాయి లభించడంతో విచారించగా, ఏ-2 కాకర లోవరాజు తీసుకొచ్చి ఇచ్చినట్లు చెప్పడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.


పాత నేరస్తులు.. గంజాయి విక్రయాలకు ప్లాన్

విచారణలో నిందితులిద్దరూ చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఏ-1 బీర దుర్గా వెంకటేష్‌పై వివిధ స్టేషన్లలో సుమారు 21, ఏ-2 కాకర లోవరాజుపై సుమారు 28 దొంగతనం కేసులు ఉన్నాయి. దొంగిలించిన సొమ్ములో కొంత వాటాను ఏ-2కు ఇస్తూ, తాను పట్టుబడితే బెయిల్‌పై విడిపించేందుకు ఏ-1 ఉపయోగించుకునేవాడు. పోలీసుల నిఘా పెరగడంతో ఇకపై దొంగతనాలు మానేసి గంజాయి విక్రయించాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా లోవరాజు చింతపల్లి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత చోరీతో పాటు కడియంలోని వైన్ షాపు, నడకుదురులోని ఒక ఇల్లు, కాకినాడ పెద్ద మార్కెట్ ప్రాంతంలోనూ ఏ-1 దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది.


చోరీ సొత్తు స్వాధీనం

నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు, తొమ్మిది వెండి కడ్డీలు, 1.6 కిలోల గంజాయితో పాటు మరో రెండు కేసులకు సంబంధించి పది ఉన్ని స్వెట్టర్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసి వారం రోజుల్లోనే కేసును ఛేదించిన మూడో పట్టణ సిఐ సత్యనారాయణ, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ త్రినాథ్, క్రైమ్ ఎఎస్ఐలు ఐ.శ్రీనివాస్, గోవిందు, హెడ్ కానిస్టేబుళ్లు సతీష్, వర్మ, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాస్, బంగార్రాజు తదితరులను ఎస్పి బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్