ప్రజాశక్తి-కాకినాడ
కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి మేయర్ అభ్యర్థి ఆకుల భవానితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శనివారం కాకినాడలో నిర్వహించిన స్థానిక ఎన్నికల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరునూ కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే ఆలోచనలో డిసిఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. నగర సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎంఎల్‌ఎలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)