ప్రజాశక్తి -ప్రత్తిపాడు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. తనిఖీల్లో భాగంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఒపి విభాగం, నవజాత శిశువుల వార్డు, జనరల్ వార్డులను పరిశీలించారు. ఒపి నమోదు ప్రక్రియ, వైద్యుల అందుబాటు, మందుల లభ్యతపై ఆరా తీశారు. అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. తల్లులు, నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, తాగునీటి వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోగుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, దోమతెరలు వినియోగించాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి. సొంత వైద్యం మానుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌సి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్, ప్రత్తిపాడు తహశీల్దార్ సూర్యప్రభ, ఎంపిడిఒ ఎంవిఆర్.కుమార్ బాబు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)